
రెచ్చిపోతున్న ‘కాపర్ దొంగలు’
పుట్టపర్తి టౌన్: జిల్లాలో కాపర్ దొంగలు రెచ్చిపోతున్నారు. నిత్యం ఏదో ఒకచోట వ్యవసాయ బోర్ల వద్ద విద్యుత్ మోటార్లకు ఉన్న కేబుల్ వైర్లను కత్తిరించి ఎత్తుకుపోతున్నారు. ఈ క్రమంలో మోటార్లు బోర్లలో పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిత్యం ఎక్కడో చోట కాపర్ చోరీ..
జిల్లాలోని 32 మండలాల పరిధిలో దాదాపు లక్షకుపైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఆరు నెలల నుంచి కాపర్ దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. వ్యవసాయ బోర్లు నుంచి మోటార్లలోకి విద్యుత్ సరఫరా చేసే కాపర్ కేబుళ్లను కోసి చోరీ చేస్తున్నారు. దీంతో మోటార్లు వందల అడుగుల లోపలికి పడిపోతున్నాయి. వాటిని మళ్లీ బయటకు తీసి కొత్తగా కేబుల్ వేసి మళ్లీ అమర్చాల్సి వస్తుంది. ఈ పని చేయడానికి ఒక్కో మోటార్‌కు కనీసం రూ.8 వేల వరకు వెచ్చించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోపల పడిపోయిన మోటార్ తీసేందుకు ఒక్కోసారి రెండు, మూడు రోజులు పడుతుండగా... పంటలకు నీళ్లు అందని పరిస్థితి నెలకొంది. ఒక్కో మోటార్ వద్ద రెండు, మూడు సార్లు చోరీలు జరగడంతో రైతుల కంటి మీద కునుకు లేకుండా పోతోంది.
దృష్టి సారించని పోలీసులు..
కాపర్ కోసం దొంగలు కేబుళ్లను చోరీ చేస్తున్న ఘటనలపై సంబంఽధిత పోలీస్టేషన్లలో కేసు కూడా నమోదవుతున్నాయి. అయితే పోలీసులు వీటిపై పెద్దగా దృష్టి సారించడం లేదు. రైతులు ఫిర్యాదు చేయగానే, ఎఫ్‌ఐఆర్ మాత్రం నమోదు చేస్తున్నారు. గట్టిగా నిలదీస్తే పొలాల్లో అర్ధరాత్రి వేళ జరిగే ఘటనలకూ తామే బాధ్యులమా అని ఎదురు ప్రశ్నిస్తున్నారని రైతులు వాపోతున్నారు. కనీసం గ్రామాల్లో పర్యటించి అనుమానితులను ప్రశ్నిస్తే చోరీ కేసులు పరిష్కారమవుతాయని రైతులు అంటున్నారు. అలాగే గతంలో దొంగతనం చేసిన వారిపై కూడా పోలీసులు దృష్టి సారించాలని కోరుతున్నారు. రాత్రి వేళల్లో బీట్లు నిర్వహించి కాపర్ దొంగల పనిపట్టాలని వేడుకుంటున్నారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో
విద్యుత్ కేబుళ్ల చోరీ
వరుస ఘటనలతో రైతుల బెంబేలు
ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్‌తో
సరిపెడుతున్న పోలీసులు
మార్కెట్‌లో కాపర్ కేజీ రూ.900 వరకు
ధర పలుకుతోంది. దీంతో దొంగలు కాపర్ కోసం వ్యవసాయ మోటార్ల వద్ద ఉన్న విద్యుత్ కేబుళ్లు కత్తిరించి ఎత్తుకెళ్తున్నారు. ఆ తర్వాత వాటి నుంచి కాపర్ వేరు చేసి కేజీ రూ.400తో విక్రయిస్తున్నారు. పొలాల్లో ఎవరూ ఉండకపోవడంతో దొంగల పని సులువవుతోంది.
కానీ ‘కాపర్ దొంగల’ దెబ్బకు రైతు జేబులు ఖాళీ అవుతున్నాయి.