
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరుబాట
రొద్దం: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వైద్యవిద్యను అభ్యసించే వారికి సీట్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఈ ప్రజా ఉద్యమానికి శనివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ శ్రీకారం చుట్టారు. మండలంలోని తాడంగిపల్లి, మోపుర్లపల్లి, ఎం.కొత్తపల్లి, గౌరాజుపల్లి గ్రామాల్లో ఆమె పర్యటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ పోస్టర్లను ఆవిష్కరించి, సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ... పేదలకు మంచి జరగాలన్న సంకల్పంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమైందని, అదే జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వైద్య విద్యార్థులకు వైద్యవిద్య దూరమవుతుందన్నారు. సర్కార్ చర్యలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ మహా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని ముందుకు నడిపించాలన్నారు.
కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టిన ఉషశ్రీచరణ్
మంత్రి సవిత కూడా తన పదవికి రాజీనామా చేసి తాము చేపడుతున్న కోటి సంతకాల ఉద్యమంలోకి రావాలని ఉషశ్రీచరణ్ ఆహ్వానించారు. పెనుకొండ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను అడ్డుకుని ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, ఎంపీపీ నాగమ్మ, సోమందేపల్లి మండల కన్వీనర్ గజేంద్ర, జెడ్పీటీసీ అశోక్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ ఇమామ్ వలి, ప్రతాప్‌రెడ్డి, వేణు, నాయకులు సి.నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, ఎన్. నారాయణరెడ్డి, స్థానిక నాయకులు రామాంజనేయులు, వీరేష్, మురళి, ఇస్లాపురం అంజి, రాజేశ్, మనీంద్రరెడ్డి, ఈశ్వర్, తిమ్మారెడ్డి, ప్రసన్న, అన్ని అనుబంధ కమిటీలు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సవితా ప్రజల రుణం తీర్చుకో..