
ప్రైవేటీకరణతో వైద్య విద్య దూరం
పెనుకొండ: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు వైద్య విద్యను దూరం చేయడమేనని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి బోధనాస్పత్రులు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ద్వారా సేవలు అందించలేరా అని మండిపడ్డారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ రాయలసీమ అభివృద్ధి వేదిక అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ, రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్ డాక్టర్ గేయానంద్ మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి 17 మెడికల్ కశాశాలలు మంజూరు చేయించిందన్నారు. ఇందులో ఇప్పటికే పలు కాలేజీలు పూర్తయి తరగతులు కూడా జరుగుతున్నాయన్నారు. మిగిలిన కాలేజీల భవన నిర్మాణ పనులు పూర్తి చేయాల్సిన కూటమి ప్రభుత్వం చేతులెత్తేయడం సరికాదన్నారు. నూతన కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే వైద్య విద్యను అభ్యసించడం పేద, మధ్య తరగతి వర్గాల వారికి పెనుభారంగా మారుతుందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే వైద్య విద్య ఫీజులు పరిమితంగా ఉంటాయన్నారు. ప్రైవేటు వారి ఆధీనంలో ఫీజులకు హద్దు లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతిలో రూ.లక్ష కోట్లకు పైగా వెచ్చించి అభివృద్ధి చేస్తామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవన నిర్మాణ పనులకు రూ.4వేల కోట్లు ఖర్చు చేయలేకపోవడం బాధాకరమన్నారు. మెడికల్ కళాశాలలను నారాయణ, అపోలోకు అప్పగించే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో పెనుకొండలోని అర్బన్, రూరల్ హెల్త్ సెంటర్‌లు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లిపోయి ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడడం ఖాయమన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్సలకూ ఇబ్బందులు తప్పవన్నారు.
పేద విద్యార్థుల కల చెదిరింది..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నూతన మెడికల్ కాలేజీల నిర్మాణానికి తీసుకున్న చర్యలు అభినందనీయమైనవని బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ అన్నారు. పేదలకు తక్కువ ఫీజులతో మెడిసిన్ చదివే అవకాశం కల్పించిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద విద్యార్థుల మెడిసిన్ కల చెదిరినట్లయ్యిందన్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, మేధావులు, రాజకీయ పార్టీలు ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు.
ప్రజా శ్రేయస్సుపై చిత్తశుద్ధేదీ?
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజా శ్రేయస్సుపై ఏమాత్రమూ చిత్తశుద్ధి లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి తనకు కావలసిన వారికి ధారాదత్తం చేయడమే బాబు నైజమన్నారు.
ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది..
ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ స్పష్టం చేశారు. ఎంతో వెనుకబడిన పెనుకొండకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తే.. వాటి ఫలాలు అనుభవించకుండా కూటమి ప్రభుత్వం ‘ప్రైవేటీకరణ’ కుట్ర పన్నడం బాధాకరమన్నారు.
దుర్మార్గమైన చర్య..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకుని 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని వైఎసార్‌సీపి ఎస్సీ సెల్ నాయకుడు కంబాలప్ప పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.30 కోట్ల మేర ఖర్చు చేసి పెనుకొండ కళాశాల పనులు చేపడుతుంటే కూటమి సర్కారు అర్ధంతరంగా నిలిపివేసి పీపీపీ విధానానికి తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
మంత్రి స్పందించాలి..
నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని పీపీపీ విధానంలో చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి సవిత స్పందించాలని పెనుకొండ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బోయ నరసింహులు డిమాండ్ చేశారు. పేదలకు అన్యాయం జరుగుతోందని తెలిసి కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు.
ప్రాణత్యాగానికై నా సిద్ధం..
వెనుకబడిన పెనుకొండ ప్రాంతానికి మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానంలో తీసుకురావడం దారుణమని మాల మహానాడు కన్వీనర్ ఎంఎన్.మూర్తి విమర్శించారు. ఈ ప్రాంత విద్యార్థులు, పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడటం సరికాదన్నారు. మెడికల్ కళాశాల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టే పోరాటంలో ప్రాణాలైనా త్యాగం చేస్తామన్నారు. ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా కార్పొరేట్‌కు అప్పజెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హరి, జేవీవీ నాయకులు ఆదిశేషు, కాంగ్రెస్ నాయకులు గంగాధర్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
పీపీపీ విధానంతో మోసం..
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రజలు, మేధావులు, విద్యార్థులు ఎవ్వరూ హర్షించరని ఏఐఎస్‌ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్ అన్నారు. మెడికల్ కాలేజీతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందడంతో పాటు పేదలకు వైద్య విద్య అభ్యసించే అవకాశం కలుగుతుందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం పేరిట ప్రజలను దారుణంగా మోసం చేస్తోందన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాలలకు
రూ.4వేల కోట్లు ఖర్చు చేయలేరా?
ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు
అందించలేరా?
కూటమి ప్రభుత్వంపై వక్తల మండిపాటు
ప్రైవేటీకరణతో తీవ్ర అన్యాయం..
పేద, మధ్య తరగతి విద్యార్థులు సైతం వైద్య విద్యను అభ్యసించాలని నాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని వైఎస్సార్‌సీపీ నేత ఆవుటాల రమణారెడ్డి అన్నారు. కరోనా సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు భవిష్యత్తులో రాకూడదని మెడికల్ కాలేజీలను తీసుకొస్తే.. కూటమి ప్రభుత్వం వాటిని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. రౖపైవెటీకరణతో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు బాధ్యతగా ఉండాలే కానీ.. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం భావ్యం కాదన్నారు. పెనుకొండ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అవుతున్నా స్థానిక మంత్రి తనకేమీ పట్టనట్టు ఉండటం బాధాకరమన్నారు. ఈ అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.