చిత్తశుద్ధితో కష్టపడితే విజయం సాధ్యం | - | Sakshi
Sakshi News home page

చిత్తశుద్ధితో కష్టపడితే విజయం సాధ్యం

Oct 11 2025 9:34 AM | Updated on Oct 11 2025 9:34 AM

చిత్తశుద్ధితో కష్టపడితే విజయం సాధ్యం

చిత్తశుద్ధితో కష్టపడితే విజయం సాధ్యం

హిందూపురం టౌన్‌: చిత్తశుద్ధితో కష్టపడితే విజయం తప్పకుండా వరిస్తుందని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ అన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హిందూపురంలోని ఎస్‌డీజీఎస్‌ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాను కలెక్టర్‌ ప్రారంభించి, మాట్లాడారు. జిల్లాలో రాబోవు రోజుల్లో మరిన్ని భారీ పరిశ్రమలు రానున్నాయన్నారు. వాటికి అనుగుణంగా చదువుతో పాటు నైపుణ్యాలనూ పెంపొందించుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో స్కిల్‌ హబ్‌సెంటర్లు ఉన్నాయని, వాటి ద్వారా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని యువతకు సూచించారు. ఉద్యోగం చిన్నదా, పెద్దదా అనే ఆలోచన కంటే ముందు జీవితంలో స్థిరపడాలనే లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. కొంతకాలం కష్టపడితే మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. అనంతరం వివిధ ప్రాంతాలకు చెందిన 15 బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు హాజరై, ఆయా కంపెనీలకు అవసరమైన మానవ వనరులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి నాగరాజు, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ, మున్సిపల్‌ చైర్మన్‌ డీఈ రమేష్‌, కళాశాల కరస్పాండెంట్‌ బైసాని రాంప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ నాగేంద్రకుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.

ఆస్పత్రిలో పారిశుధ్యాన్ని మెరుగుపరచండి..

ప్రభుత్వాస్పత్రిలో పారిశుధ్యాన్ని మెరుగు పరచాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు. శుక్రవారం హిందూపురం వచ్చిన కలెక్టర్‌.. జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. సదరం క్యాంపును, ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడుతూ.. అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సదరం క్యాంప్‌ను పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. రోగులతో ఆప్యాయంగా మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వార్డుల్లో వర్షపు నీరు నిలిచి అపరిశుభ్రంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. వార్డులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేవించారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ మధుసూదన్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అన్నపూర్ణ, ఆర్‌ఐఓ డాక్టర్‌ లక్ష్మీరామ్‌నాయక్‌, పాల్గొన్నారు.

పట్టుగూళ్ల విక్రయ కేంద్రం తనిఖీ

హిందూపురం: పట్టుసాగులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని, ఇందుకు అవసరమైన సహకారం అందిస్తామని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం హిందూపురంలోని పట్టుగూళ్ల విక్రయ కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. పట్టుగూళ్ల ఈ–వేలం పద్దతి, ఈ–మార్కెటింగ్‌ ప్రక్రియలను పరిశీలించారు. పట్టు రైతులతో మల్బరీ సాగు, పట్టుగూళ్ల ఉత్పత్తి విక్రయాలపై ఆరా తీశారు. అలాగే పట్టు రైతులు, రీలర్లతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా పట్టురైతులు, రీలర్లకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ మంజూరు కాలేదని, వాటిని మంజూరు చేయించాలని కలెక్టర్‌ను పలువురు అభ్యర్థించారు. కార్యక్రమంలో పట్టు శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు శోభారాణి, హిందూపురం సహాయ సంచాలకులు రత్నం, పట్టుగూళ్ల కేంద్ర అధికారి హంపయ్య, రైతులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement