
రోడ్డు ప్రమాదంలో నెమలి మృతి
చిలమత్తూరు: రోడ్డు ప్రమాదంలో నెమలి మృతి చెందింది. తుమ్మలకుంట సమీపంలోని శనివారం ఉదయం రోడ్డు దాటుతున్న నెమలిని గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నెమలి మృతి చెందింది. అయితే కాసేపటికే నెమలిని మాయం చేశారు. సమీప గ్రామాలైన తుమ్మలకుంట, కాపుచెన్నంపల్లి, చిలమత్తూరుకు చెందిన వారు ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వృద్ధురాలు ఆత్మహత్య
ఎన్‌పీకుంట: బలిజపల్లిలో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన కమ్మల వెంకటలక్ష్మమ్మ (82) గత కొంత కాలంగా నోటి క్యాన్సర్‌తో బాధ పడుతోంది. తనకు సపర్యలు చేయడానికి ఎవరూ లేకపోవడంతో మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మమ్మ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
వివాహిత అదృశ్యం
కదిరి టౌన్: పట్టణంలోని ఆడపాలవీధి వైఎస్సార్ పార్క్ సమీపంలో నివాసం ఉండే హేమావతి అనే వివాహిత అదృశ్యమైంది. ఈ నెల నాలుగో తేదీన భర్తతో ఏదో చిన్న విషయమై గొడవ పడింది. తర్వాత ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఎన్నిచోట్ల వెదికినా కనిపించకపోవడంతో భర్త జగన్నాథం శివ శనివారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు.
ప్రేమ పేరుతో వంచన
● అత్యాచారం కేసు నమోదు
● నిందితుడికి రిమాండ్
రాప్తాడురూరల్: ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లికి ముఖం చాటేసిన యువకుడిపై అత్యాచారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అనంతపురం రూరల్ మండలానికి చెందిన ఓ యువతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఈమెకు ఆరు నెలల కిందట వరుణ్‌తేజ్ అనే లా విద్యార్థితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన వరుణ్‌తేజ్.. శారీరకంగా దగ్గరయ్యాడు. తర్వాత పెళ్లి గురించి ప్రస్తావన తెస్తే మాట మార్చాడు. ఎన్నిసార్లు బతిమాలినా నిరాకరించడంతో తను మోసపోయానని యువతి గ్రహించింది. తనను నమ్మించి అత్యాచారం చేశాడని బాధితురాలు శనివారం అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు వరుణ్‌తేజ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
ప్రమాదవశాత్తూ కానిస్టేబుల్ మృతి
రాప్తాడురూరల్: ప్రమాదవశాత్తూ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున అనంతపురం రూరల్ మండలం బసవతారకనగర్‌లో చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. బసవతారకనగర్‌లో నివాసం ఉంటున్న సతీష్‌కుమార్ (38) అనంతపురం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో పాలు తెచ్చేందుకని బైక్‌పై వెళ్తుండగా కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ సతీష్‌కుమార్‌ను తొలుత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స ప్రారంభించేలోపే మృత్యువాతపడ్డాడు. వివాదారహితుడిగా సతీష్‌కుమార్ మంచి గుర్తింపు ఉంది. అకాలమృతిని సన్నిహుతులు, డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోయారు. మృతుడికి భార్య మంజుతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శేఖర్ తెలిపారు.
గార్లదిన్నె: అనంతపురం ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్‌కుమార్ (38) అంత్యక్రియలు శనివారం గార్లదిన్నె మండలం పాత కల్లూరులో పోలీసు లాంఛనాలతో నిర్వహించినట్లు శింగనమల సీఐ కౌలుట్లయ్య తెలిపారు. సతీష్‌కుమార్ 2011 నుంచి పోలీసు శాఖలో పనిచేస్తున్నారన్నారు.
జిల్లా ఆస్పత్రికి పూర్వవైభవం తెస్తాం
హిందూపురం టౌన్: హిందూపురం జిల్లా ఆస్పత్రికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. శనివారం కలెక్టర్ శ్యాం ప్రసాద్‌తో కలిసి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో కలెక్టర్, ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులతో కలిసి భూ సేకరణ అంశంపై ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. త్వరలో రేడియాలజిస్ట్‌ను నియమించి స్కానింగ్‌తో పాటు సీటీ స్కాన్ సేవలను సైతం అందుబాటులోకి తెస్తామన్నారు. హిందూపురం నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో ఏరో స్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు మంచి ధర ఇప్పించే బాధ్యత తనదని అన్నారు. కార్యక్రమాల్లో పెనుకొండ సబ్ కలెక్టర్ ఆనంద్ కుమార్, తహసీల్దార్ వెంకటేశు, ఏపీఐఐసీ జెడ్‌ఎం, డీసీహెచ్‌ఎస్, ఆస్పత్రి మెడికల్ సూపరిటెండెంట్ అన్నపూర్ణ, ఆర్‌ఎంఓ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో నెమలి మృతి

రోడ్డు ప్రమాదంలో నెమలి మృతి

రోడ్డు ప్రమాదంలో నెమలి మృతి