
జిల్లాలో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేయండి
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్ ఏర్పాటయ్యేలా చూడాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్‌కు ఏపీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్యా శంకర నాయక్ విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు లేక అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ మొత్తాన్ని గిరిజన ప్రాంత అభివృద్ధికే ఖర్చు పెట్టాలని కోరారు. గిరిజనుల్లోకి ఇతర కులాలను చేర్చే ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలన్నారు. గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లాలో పరిశ్రమలు, స్మాల్ స్కేల్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎల్‌ఐసీ నారాయణనాయక్, ఆనంద్‌నాయక్, గోపాల్‌నాయక్, అంజీ నాయక్, సురేంద్ర నాయక్, చిన్న అంజీ నాయక్, శశిధర్ నాయక్, హనుమంతు నాయక్ తదితరులు ఉన్నారు.
గ్రామాల్లో ప్రత్యేక నిఘా
ఉంచాలి : ఎస్పీ
గాండ్లపెంట: గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని సిబ్బందికి ఎస్పీ సతీష్‌కుమార్ సూచించారు. స్ధానిక పీఎస్‌ను వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం ఎస్పీ పరిశీలించారు. రికార్డులు, ఎన్‌డీపీఎస్ కేసుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆక్రమ మద్యం, పేకాట, గుట్కా, క్రికెట్ బెట్టింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులతో సమావేశపై పలు అంశాలను ఆరా తీశారు. కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి, రూరల్ సీఐ నాగేంద్ర, ఏఎస్‌ఐ వెంకట్రాముడు పాల్గొన్నారు.
నల్లచెరువు: స్థానిక పీఎస్‌ను శుక్రవారం ఎస్పీ సతీస్‌కుమార్ తనిఖీ చేశారు. ఆయన వెంట డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐ నాగేంద్ర ఉన్నారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను ఎస్‌ఐ మక్భూల్ బాషాతో ఆరా తీశారు.

జిల్లాలో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేయండి