
ముంపు ప్రమాదంలో గుడ్డంపల్లి
● ఆందోళనలో గ్రామస్తులు
తాడిమర్రి: మండల సరిహద్దులోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) లోకి గండికోట రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను నిలుపుదల చేయకపోతే గుడ్డంపల్లి గ్రామం మునిగిపోతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం వారు సీబీఆర్ వరద నీటిలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. రెండేళ్లుగా గండికోట రిజర్వాయర్ నీటిని సీబీఆర్‌లోకి పంపింగ్ చేస్తున్నారని, దీంతో గ్రామంలోకి నీరు చొచ్చుకుని వస్తోందన్నారు. గత ఏడాది గండికోట నుంచి 10 టీఎంసీలు నీటిని వదలారని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా ఇప్పటికే గ్రామ సమీపంలోకి నీరు చేరిందన్నారు. గ్రామానికి ఓ వైపు నీరు, మరోవైపు పొలాలు ఉండటంతో పశువులను మేపునకు తీసుకెళ్లడానికి కూడా ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నీటిని పంపింగ్ చేయడం నిలుపుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో బాస్వంతరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, వెంకటనారాయణరెడ్డి, నాగిరెడ్డి, వెంకటలక్ష్మమ్మ, నాగమ్మ, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రుల చెంతకు
వివాహిత
బత్తలపల్లి: భర్తతో కలిసి కాపురం చేయడం ఇష్టం లేక తన ఇద్దరు కుమార్తెలతో కలసి కనిపించకుండా పోయిన వివాహిత ఆచూకీని పోలీసులు గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ నెల 6న బత్తలపల్లికి చెందిన భాగ్యలక్ష్మి తన ఇద్దరు కుమార్తెలను పిలుచుకుని ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. భాగ్యలక్ష్మి తల్లి గోగుల అరుణ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. తిరుమలలో ఉన్నట్లుగా గుర్తించి అక్కడికెళ్లి శుక్రవారం వారిని పిలుచుకొచ్చారు. అనంతరం తల్లిదండ్రులను పీఎస్‌కు పిలిపించి కౌన్సెలింగ్ అనంతరం అప్పగించారు.