
సచివాలయ ఉద్యోగి చేతివాటం!
నల్లచెరువు: మండల కేంద్రంలోని సచివాలయం–2లో గతంలో విధులు నిర్వర్తించిన ఓ ఉద్యోగి పింఛన్ సొమ్ము పంపిణీలో చేతివాటం ప్రదర్శించాడు. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన ఓ వితంతు మహిళకు రెండేళ్ల క్రితం పింఛన్ మంజూరైంది. అప్పట్లో మూడు నెలలు క్రమం తప్పకుండా ఆమె పింఛన్ తీసుకున్నారు. ఆ తర్వాత బతుకు తెరువు కోసం సౌదీకి వెళ్లిపోయారు. కొన్నిరోజుల క్రితం తిరిగి వచ్చిన ఆమె రెండు రోజుల క్రితం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి తన పింఛన్‌పై ఆరా తీసింది. అయితే రెండేళ్లుగా ప్రతి నెలా ఆమె పింఛన్ తీసుకుంటున్నట్లుగా రికార్డు ఉందని అధికారులు తెలిపారు. అయితే తాను సౌదీలో ఉండగా తన పింఛన్ ఎవరు తీసుకుంటారని ఆమె ప్రశ్నించడంతో అధికారులు రికార్డులన్నీ పరిశీలించారు. పింఛన్ పంపిణీ చేసే సచివాలయ ఉద్యోగి తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్బీస్ యాప్ ద్వారా తన అథెంటికేషన్ అప్‌డేట్ చేసి రెండేళ్లుగా పింఛన్ సొమ్ము కాజేసినట్లుగా నిర్ధారించారు. ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా గార్లదిన్నెకు వెళ్లినా... ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సదరు మహిళ పింఛన్ ఐడీని కూడా తాను బదిలీ అయిన చోటుకు మార్పు చేసుకుని పింఛన్ సొమ్ము కాజేస్తున్నట్లుగా గుర్తించారు. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకున్న టీడీపీ నాయకులు.. సదరు ఉద్యోగితో మాట్లాడి స్వాహా చేసిన సొమ్మును ఇప్పించినట్లు సమాచారం. ఈ విషయంపై ఎంపీడీఓ రామకృష్ణను వివరణ కోరగా.. బాధితురాలు పిర్యాదు మేరకు సచివాలయ ఉద్యోగిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు.
స్వాహా చేసిన పింఛన్ సొమ్ము చెల్లింపు
చెన్నేకొత్తపల్లి: పింఛన్‌దారులకు పంపిణీ చేయాల్సిన రూ.39 వేలు తీసుకుని ఉడాయించిన న్యామద్దెల సచివాలయం–1 సర్వేయర్ హేమంత్‌కుమార్ గురువారం ఆ సొమ్మును ఎంపీడీఓ బాలకృష్ణకు అప్పగించారు. ఈనెల 1వ తేదీన పింఛన్ డబ్బుతో ఉడాయించిన హేమంత్ కుమార్.. చివరకు ఫోన్‌లో కూడా వారం రోజులుగా అందుబాటులోకి రాలేదు. దీంతో ఎంపీడీఓ బాలకృష్ణుడు బుధవారం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే హేమంత్‌కుమార్ సంజాయిషీ కూడా ఇవ్వకపోవడంతో తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సర్వేయర్ హేమంత్‌కుమార్ గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. పింఛన్ సొమ్ము రూ.39 వేలు చెల్లించారు. దీంతో మరోసారి ఇలా చేయవద్దని ఎంపీడీఓ మందలించి పంపారు.
మామిడి మొక్కల నరికివేత
ధర్మవరం రూరల్: మండలంలోని ముచ్చురామి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రామ్మోహన్‌రెడ్డికి చెందిన 30 మామిడి మొక్కలను గురువారం గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. బాధితుడు తెలిపిన మేరకు... తనకున్న పొలంలో 150 మామిడి మొక్కలను సాగు చేశానన్నారు. రెండేళ్ల వయసున్న 30 మొక్కలను నరికి వేశారన్నారు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

సచివాలయ ఉద్యోగి చేతివాటం!