
రేషన్ సరుకుల కోసం వేచి ఉన్న లబ్ధిదారులు (ఫైల్)
అటకెక్కిన రేషన్ కార్డుల మంజూరు
పట్టించుకోని కూటమి సర్కారు
రేషన్ కార్డుకు సంబంధించి దరఖాస్తులన్నీ బుట్టదాఖలు
విసిగిపోతున్న పేద ప్రజలు
ఇంకెప్పుడు మంజూరు చేస్తారంటూ మండిపాటు
కొత్త రేషన్ కార్డు మంజూరు కావడం లేదు. కార్డులోకి పేరు చేర్చమంటున్నా పట్టించుకోవడం లేదు. కార్డుకు సంబంధించి ఆధార్ సీడింగ్ కరెక్షన్, తొలగింపు తదితర ప్రక్రియలనూ అటకెక్కించారు. కూటమి సర్కారు నిర్లక్ష్య ధోరణితో జిల్లాలో పేద ప్రజలు విసిగిపోతున్నారు. రేషన్ సరుకుల్లో కోత మినహా కొత్త కార్డుల గురించి పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పేద ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా ఫలితం కానరావడం లేదు. దరఖాస్తుదారులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. దరఖాస్తులు తీసుకున్నాం.. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కార్డులు ఇస్తాం అంటూ ఏడాదిగా కాలం వెళ్లదీస్తుండడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో 35 వేల మంది పైగా కొత్త కార్డుల కోసం దరఖాస్తులు అందజేశారు.
బుట్టదాఖలు..
కొన్ని కుటుంబాల్లో పెళ్లిళ్లు జరిగి ఉంటాయి. లేదా పిల్లలు పెద్దవాళ్లై ఉంటారు. అలాంటి వారి పేర్లు రేషన్ కార్డులోకి చేర్చాలి. కానీ అర్హులు ఏడాదిగా బతిమాలుతున్నా చేర్చడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.19 లక్షల మంది తమ పేరును రేషన్ కార్డులో చేర్చాలని దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకూ అతీగతీ లేదు. దరఖాస్తులు చెత్తబుట్టల్లో వేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేదు..
మృతి చెందిన వారి కార్డులు తొలగించి ఎప్పటికప్పుడు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. గత సర్కారు హయాంలో ఎప్పుడూ సంతృప్త స్థాయిలో ఎప్పటికప్పుడు ఇచ్చేవారు. గ్రామ/వార్డు సచివాలయాల నుంచి దరఖాస్తు చేసుకోగానే మంజూరు చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాది నుంచి కొత్త రేషన్ కార్డుల ఊసే లేకుండా పోయింది. ఇందుకోసం వచ్చిన దరఖాస్తులు ఎక్కడున్నాయో కూడా తెలియడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇక చిరునామాలు, పేర్లలో మార్పులకు అసలు దిక్కేలేదు.
రేషన్‌లో కోత మినహా..
రేషన్ సరుకుల్లో కోత మినహా కూటమి సర్కారు చేస్తున్నదేమీ లేదని లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు. గతంలో గోధుమలు ఇచ్చేవారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆరునెలలుగా వాటిని ఇవ్వడం లేదు. జొన్నలూ లేవు. వైఎస్సార్ సీపీ హయాంలో ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో 8 వేల మందికి పైగా వృద్ధులకు రేషన్ అందడం లేదు.