
గురుకులాల్లో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు అంబేడ్కర్ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయ అధికారి కె.జయలక్ష్మీ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2024–25 విద్యా సంవత్సరంలో రెగ్యులర్ లేదా సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. బాలికలకు ఉరవకొండ కళాశాలలో ఎంఈసీ గ్రూపులో ఎస్సీ–18, ఎస్టీ–2, ఓసీ–1, సీఈసీలో ఎస్సీ–1, ఎస్టీ–1, ఓసీ–1, బ్రహ్మసముద్రం కళాశాలలో హెచ్‌ఈసీలో ఎస్సీ–9, ఎస్టీ–1, ఓసీ–1, సీఈసీలో ఎస్సీ–6, నల్లమాడ కళాశాలలో సీఈసీలో ఎస్సీ–39, ఎస్టీ–3, ఓసీ–1, బాలురకు సంబంధించి కణేకల్లు కళాశాలలో బైపీసీలో బీసీ–2, ఎస్సీ–1, కాళసముద్రం కళాశాలలో ఎంపీసీలో ఎస్టీ–1, బైపీసీ గ్రూపులో బీసీ–2, ఎస్సీ–2 సీట్లు ఖాళీలున్నాయని వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు నేరుగా సర్టిఫికెట్లతో ఆయా కళాశాలలకు వెళ్లి అడ్మిషన్లు పొందవచ్చన్నారు. అలాగే పప్పూరులోని బాలుర ఐఐటీ, నీట్ కళాశాలలో బైపీసీ గ్రూపులో ఎస్సీ–2 సీట్లు ఖాళీలున్నాయన్నారు. పదో తరగతిలో రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాల్లో 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు.
ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు ‘అహుడా’ అనుమతి తప్పనిసరి
అనంతపురం అర్బన్: అహుడా పరిధిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు కచ్చితంగా అనుమతి పొందాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ స్పష్టం చేశారు. అహుడా పరిధిలో వీలైనంత ఎక్కువగా భూ బ్యాంక్ గుర్తించాలని చెప్పారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో అహుడా ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. అనంతపురం, మడకశిర, కళ్యాణదుర్గం, గుత్తి, పుట్టపర్తి, హిందూపురం, పెనుకొండ తదితర ప్రాంతాల్లో అహుడా చేపట్టిన పనులు, వాటి పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అహుడా పరిధిలో ప్లాట్ల క్రమబద్ధీకరణ చేసుకోని వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారితో సమన్వయం చేసుకుని ఈ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. నగర, పట్టణ కేంద్రాల్లో నివాసయోగ్యమైన ప్రాంతాలకు దగ్గరగా భూములను ఎంపిక చేయాలని చెప్పారు. భూ సేకరణ క్రమంలో పెండింగ్ పనులను సత్వరం పూర్తి చేయాలని సూచించారు.లే అవుట్లలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుని పనులను వేగవంతం చేయాలని చెప్పారు.
న్యాయం చేయకపోతే
ఆత్మహత్యనే శరణ్యం
కదిరి అర్బన్: తన కుమారుడితో పాటు మరో బాలుడిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే తమకు ఆత్మహత్యనే శరణ్యమని కాళసముద్రం సర్పంచు లలితమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే.. మండల పరిధిలోని కాళసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గంజాయి బ్యాచ్ వ్యవహారం సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. గంజాయి మత్తులో ఇద్దరు మైనర్లపై మరో ముగ్గురు మైనర్లు దాడి చేశారు. ఈ నేపథ్యంలో గురువారం కాళసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పౌరహక్కులపై గ్రామస్తులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ వీ రత్న హాజరయ్యారు. తమ పిల్లలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ లలితమ్మతో పాటు గ్రామానికి చెందిన పలువురు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. మైనర్ విద్యార్థులపై దాడి చేసిన వారికి చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని డీఎస్పీ శివనారాయణస్వామి హామీ ఇచ్చారు. అనంతరం పౌర హక్కులపై ఎస్పీ రత్న ప్రజలకు అవగాహన కల్పించారు.
కమాండ్ కంట్రోల్ రూం ప్రారంభం
కదిరి టౌన్: శాంతిభద్రత పరిరక్షణలో సీసీ కెమెరాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ రత్న తెలిపారు. కదిరి పట్టణంలో రూ.43 లక్షల వ్యయంతో నిర్మించిన కమాండ్ కంట్రోట్ రూమ్ మహిళా రక్షణ విభాగం, పట్టణ వాసులు స్వచ్ఛందంగా వితరణ చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో ఎస్పీ రత్న, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం మహిళా రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేసి ఒక మహిళా ఎస్‌ఐని కూడా నియమించామన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నియత్రణకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

గురుకులాల్లో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లు