
పింఛన్‌దారులకు ప్రతినెలా గండం
పుట్టపర్తి అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాజిక పింఛన్‌దారులకు ప్రతి నెలా గండం తప్పడం లేదు. ఎవరి పింఛన్ ఏ నెలలో ఎగిరిపోతుందోనని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలలో కొందరు చొప్పున 14 నెలల కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వం పదివేలకుపైగా పింఛన్లు కోత విధించింది. దీంతో బాధితులు రోడ్డున పడాల్సిన పరిస్థితులు దాపురించాయి.
10,817 పింఛన్లు కట్..
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత మొదటగా 2024 జూలైలో 2,70,973 పింఛన్‌దారులు ఉండేవారు. ఈ 14 నెలల కాలంలో ప్రతి నెలా విడతల వారీగా సుమారు 10,817 పింఛన్‌లను తొల గించారు. కొన్ని మండలాల్లో అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి వేలాది పెన్షన్లు తొలగింపజేశారు. మరణించిన వారితో పాటు 10,817 పింఛన్లు పంపిణీకి నోచుకోలేదు. ఇప్పటికే రూ.15 వేలు, రూ.10 వేలు, వికలాంగుల పింఛన్లదారులను రకరకాల సర్వేల పేరుతో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో కూడా అనర్హుల పేరుతో పింఛన్ తీసివేస్తారేమోనని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
50 ఏళ్లకే పింఛన్ల హామీ గాలికి..
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి 50 ఏళ్లకే పింఛన్లు అంటూ వెనుకబడిన వర్గాల వారి నుంచి ఓట్లు కొల్లగొట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తవుతున్నా ఇప్పటి వరకూ ఇచ్చిన హామీని అమలు చేయలేక చేతులెత్తేసింది. దీంతో ఆయా వర్గాలకు చెందిన లక్షలాది మంది మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్లపై ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి నూతన పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండేది. కులం, మతం, పార్టీ చూడకుండా సచివాలయ, వలంటర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దనే పింఛన్లను అందజేసేవారు. ప్రస్తుతం ఎవరికీ పింఛన్ ఇస్తారో.. ఎక్కడిస్తారో కూడా తెలీని పరిస్థితి నెలకొందని లబ్ధిదారులు వాపోతున్నారు.
నేటి నుంచి పింఛన్ల పంపిణీ..
జిల్లాలో ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లను శుక్రవారం నుంచి లబ్ధిదారులకు అందజేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 2,64,665 మంది పింఛన్‌దారులకు రూ.115.68 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. ప్రతి నెలా అందజేసే 2,60,156 పింఛన్‌దారులతో పాటు అదనంగా ఈనెలలో వితంతు పింఛన్లు 4509 మంజూరైనట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 2019 నుంచి జూలై 2025 వరకూ కుటుంబ యజమాని పింఛన్ పొందుతూ మరణించినట్లయితే భార్యకు స్పౌజ్ కేటగిరి కింద కొత్తగా 4509 మందికి పింఛన్ మంజూరు చేసినట్లు తెలిపారు. వీరికి అదనంగా రూ.1.80 కోట్లు మంజూరు చేశామన్నారు. ఇదిలా ఉండగా.. వితంతు పెన్షన్లు అందజేస్తామని ప్రభుత్వం ఇప్పటికే నాలుగు సార్లు చెప్పి పంపిణీ చేయలేదు. ఈ నెల అయినా అందిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
విడతల వారీగా లబ్ధిదారులను
ఏరివేస్తున్న కూటమి ప్రభుత్వం
ఇప్పటికే పదివేలకు పైగా
పింఛన్ల రద్దు
లబోదిబోమంటున్న లబ్ధిదారులు