
రైతుల పేరుతో తమ్ముళ్ల డ్రామా
పెనుకొండ: కాంట్రాక్టులు, కమీషన్ల కోసం ‘కియా’ అనుబంధ కంపెనీ ఎదుట తెలుగు తమ్ముళ్ల అలజడిపై విమర్శలు వెల్ల్లువెత్తగా..టీడీపీ నేతలు దిద్దుబాటు చర్యలకు దిగారు. బుధవారం రైతుల పేరుతో సమావేశం నిర్వహించి సరికొత్త నాటకానికి తెరలేపారు. ‘కియా’తో పాటు అనుబంధ కంపెనీలకు భూములిచ్చిన రైతుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలివ్వాలంటూ హైడ్రామా నడిపారు.
మంగళవారం సంఘు హైటెక్ కంపెనీ వద్ద తెలుగు తమ్ముళ్లు చేసిన హంగామాతో మంత్రి సవిత ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. కాంట్రాక్టులు, కమీషన్ల కోసం మంత్రి సవితనే అనుచరులను ఉసిగొల్పారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు కంపెనీలపై, వాహనాల యజమానులపై తెలుగు తమ్ముళ్లు చేసిన దాడుల ఘటనలూ మరోసారి చర్చనీయాంశమయ్యాయి. గతంలో గ్రీన్ టెక్ కంపెనీకి వెళ్లే కంకర లారీలు నిలిపి వేయడం, దౌర్జన్యానికి పాల్పడటం, మామూళ్ల కోసం ఇటీవల కియా అనుబంధ కంపెనీకి సామగ్రి తెచ్చిన ఓ కంటెయినర్ లారీ అద్దాలు పగుల గొట్టిన అంశాలు తెరపైకి వచ్చాయి.
మంత్రి సవిత అనుచరుల ఆగడాలతో కియా అనుబంధ కంపెనీలను మరో ప్రాంతానికి తరలించాలన్న నిర్ణయానికి యజమానులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంతో ఓర్పుతో ఉన్నామని... ఇక ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవడమే మేలనే ఆలోచనతో ఉన్నట్లు పలు కంపెనీల యజమానులు చెబుతున్నారు. దీంతో టీడీపీ అధిష్టానం కూడా ఇరుకునపడినట్లు తెలుస్తోంది. స్థానికంగా కూడా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మంత్రి అనుచరులు బుధవారం సమావేశం నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని పేర్కొనడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కియా సబ్ కంపెనీలకు, కియా కంపెనీకి భూములిచ్చిన ప్రతి రైతు కుటుంబానికి ఇప్పటికే ‘కియా’లో ఉద్యోగాలు లభించాయనీ, ఇప్పుడు టీడీపీ నాయకులు ఎవరికి ఉద్యోగాలు ఇప్పిస్తారోనని జనం చర్చించుకుంటున్నారు.
‘కియా’ వద్ద అలజడితో
మంత్రి సవితపై వెల్లువెత్తిన విమర్శలు
దిద్దుబాటు చర్యలకు దిగిన
టీడీపీ నేతలు
స్థానికులకు ఉద్యోగాలివ్వాలనే
ఆందోళన చేసినట్లు వెల్లడి
వెళ్లిపోయేందుకు సిద్ధమైన కంపెనీలు..
వెలుగులోకి మంత్రి సవిత ఆగడాలు..