ఆటో ఢీకొని బాలుడి మృతి

గుంతకల్లు రూరల్: మండల పరిధిలోని నెలగొండ గ్రామంలో శుక్రవారం ఆటో ఢీ కొనడంతో షాన్వాజ్ (4) అనే బాలుడు మృతిచెందాడు. స్థానికుల వివరాల మేరకు.. నెలగొండ గ్రామానికి చెందిన రుక్మాన్ బాషా, ఖాదర్‌బీ దంపతుల కూతురు అయిన మున్నీని 13 సంవత్సరాల క్రితం గుంతకల్లు మండలంలోని నరసాపురంకు చెందిన దస్తగిరి బాషా అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కూతుళ్లు , కుమారుడు షాన్వాజ్ (4) సంతానం. మున్నీ పుట్టినిళ్లు అయిన నెలగొండలో మూడు రోజులుగా నూతనంగా నిర్మించిన వీరాంజనేయ ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగానే మున్నీ కూడా తన పుట్టినింటికి వెళ్లింది. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు షాన్వాజ్ ఉన్నట్టుండి రోడ్డుపైకి వెళ్లాడు. అదేసమయంలో అటు నుంచి వేగంగా వచ్చిన ఆటో బాలుడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన షాన్వాజ్‌ను కుటుంబ సభ్యులు వెంటనే గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరయ్యారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ ఎస్‌ఐ సురేష్ తెలిపారు.