సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగర మేయర్ పీఠంపై అధికార కూటమిలో రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్నా.. అధికార టీడీపీలో అభ్యర్థి ఎంపిక పంచాయితీ కొలిక్కి రావడం లేదు. గత పది రోజులుగా రోజుకో పేరు తెరపైకి వస్తుండడం.. తెరవెనుక మంత్రాంగాలు.. నేతల మధ్య ఆధిపత్య పోరు.. వెరసి మేయర్ అభ్యర్థి ఎవరన్నది ఉత్కంఠగా మారింది. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి వర్గాలు ఒక వైపు.. నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వర్గం మరోవైపు పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరో వైపు కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ సైతం మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకుని హడావుడి చేస్తోంది. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ఎన్నికల సమరానికి సిద్ధమవడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది.
అభ్యర్థి ఒక్కరు.. ఆశావహులు పలువురు
మేయర్ అభ్యర్థి ఎంపిక టీడీపీలో అంతర్గత ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. పార్టీ నిర్ణయం కంటే తమకు అనుకూలమైన వ్యక్తికి అవకాశం దక్కాలన్న పట్టుదలే నేతల మధ్య విభేదాలకు కారణమవుతోందనే చర్చ వినిపిస్తోంది. రిజర్వేషన్ల ప్రకటనకు ముందే మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి దంపతులు తమకు సన్నిహితుడైన రూప్‌కుమార్‌యాదవ్ పేరును తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు అధిష్టానం ఆమోదం పొందేందుకు వారిద్దరూ సీఎం చంద్రబాబును కలిసి మాట్లాడినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగింది. ఈ పరిణామం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి అసంతృప్తి కలిగించినట్లు తెలుస్తోంది. నగర రాజకీయాల్లో తన ప్రమేయం లేకుండా మేయర్ అభ్యర్థి ఎంపిక దిశగా అడుగులు పడటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారనే చర్చ ఉంది. రూప్‌కుమార్ అభ్యర్థిత్వానికి అడ్డుకట్ట వేసేలా తనదైన వ్యూహాలకు పదును పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
నారాయణ పట్టుదల.. కోటంరెడ్డి వ్యూహం
రూప్‌కుమార్‌యాదవ్ అభ్యర్థిత్వంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు మంత్రి నారాయణ, కోటంరెడ్డి మధ్య చర్చలు జరిగినట్లు ప్రచారం ఉంది. నెల్లూరు మేయర్ పీఠానికి జనరల్ రిజర్వేషన్ ఖరారైన నేపథ్యంలో తన రాజకీయ ప్రాధాన్యాన్ని నిలబెట్టుకోవడంతోపాటు భవిష్యత్ రాజకీయాల్లోనూ పట్టు కొనసాగించాలనే లక్ష్యంతో కోటంరెడ్డి తన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి పేరును ముందుకు తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది. తన సోదరుడికి మేయర్ పీఠం దక్కితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన కుమార్తె సాయి వైష్ణవికి రాజకీయంగా మార్గం సుగమమవుతుందనే అంచనాతో ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
నామినేషన్ల వేళకు కొలిక్కిరాని పంచాయితీ
మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి మధ్య అభ్యర్థి
ఎంపికపై ఆధిపత్య పోరు
మధ్యలో మేయర్ పీఠం మాదేనంటూ కమలనాథుల హడావుడి
వైఎస్సార్సీపీ కేడర్‌లో జోష్
పీఠంపై కన్నేసి.. భంగపడిన కమలనాథులు
కూటమిలో సీట్ల పంపకాల చర్చల నేపథ్యంలో నెల్లూరు మేయర్ పీఠంపై బీజేపీ కూడా ఆశలు పెట్టుకుంది. జనరల్ రిజర్వేషన్ ఖరారు కావడంతో ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు కమలనాథులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతో నెల్లూరు పీఠం కమలదళానికే దక్కుతుందనే ప్రచారం రెండు రోజుల పాటు నగర రాజకీయాల్లో హడావుడి సృష్టించింది. గాంధీబొమ్మ సెంటర్లో బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. అయితే నెల్లూరు మేయర్ స్థానాన్ని బీజేపీకి కేటాయించేందుకు టీడీపీ సుముఖంగా లేదనే సంకేతాలు రావడంతో ఆ పార్టీ నేతలు భంగపాటుకు గురి చేసింది. దీంతో మేయర్ పీఠంపై కమలనాథులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి.


