● యర్రంరెడ్డి, సూరా పార్టీకి రాజీనామా
బుచ్చిరెడ్డిపాళెం: పుర, పరిషత్, పంచాయతీ ఎన్నికల వేళ టీడీపీలో అసంతృప్తి సెగలు కక్కుతున్నాయి. మూడు దశాబ్దాలుగా టీడీపీలో క్రియాశీలకంగా కొనసాగిన సీనియర్ నేత యర్రంరెడ్డి గోవర్ధన్రెడ్డితోపాటు వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ సురా శ్రీనివాసులురెడ్డి తమ అనుచరులతో కలిసి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీ కోసం ఏళ్ల తరబడి శ్రమించినా తమకు తగిన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని, వర్గ రాజకీయాలతో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశలోనే ప్రారంభమైందని, 54 ఏళ్ల రాజకీయ జీవితంలో 34 సంవత్సరాలు టీడీపీలో కొనసాగానని యర్రంరెడ్డి తెలిపారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేశామని, గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సమయంలో అందరి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇచ్చే వారని, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. తమ కుటుంబాలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించాలని కోరినా స్పందన కరువైందన్నారు. మరో సీనియర్ నేత సూరా శ్రీనివాసులు రెడ్డి సైతం స్థానిక నాయకత్వాన్ని పక్కన పెట్టి కొందరికే ప్రాధాన్యం ఇవ్వడంపై తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ సాధించిన 12 వేల ఓట్ల మెజారిటీ వెనుక నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి ఉందన్నారు. అలాంటి విజయానికి కష్టపడిన వారిని విస్మరించడం సరికాదన్నారు. టీడీపీకి రాజీనామా చేసినప్పటికీ భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.


