స్థానిక ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు

Oct 16 2026 1:18 AM | Updated on Oct 16 2026 1:18 AM

కొడవలూరు: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పగడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా అధికారులను ఆదేశించారు. కోవూరు నియోజకవర్గ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నార్తురాజుపాళెంలోని జీవనజ్యోతి జూనియర్‌ కళాశాలలో స్ట్రాంగ్‌రూము, కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్‌ గురువారం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కోవూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులను ఇక్కడ భద్రపరచనున్నట్లు తెలిపారు. స్ట్రాంగ్‌ రూమ్‌, రిసెప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పించడంతో పాటు కౌంటింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. కలెక్టర్‌ వెంట జెడ్పీ డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య, నెల్లూరు, కావలి ఆర్డీఓలు అనూష, ఎలీషాబాబు, ఎంపీడీఓ వెంకటసుబ్బారావు తదితరులు ఉన్నారు.

ఈవీఎం గోదాములో

తనిఖీలు

నెల్లూరు సిటీ: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోదామును రాష్ట్ర డిప్యూటీ చీఫ్‌ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌, రాష్ట్ర ఈవీఎం నోడల్‌ అధికారి ఎస్‌ ఆంజనేయులు కలెక్టర్‌ హిమాన్షుశుక్లాతో కలిసి గురువారం తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా గోదాముకు వేసిన సీలు, సీసీ కెమెరాల పనితీరు మొదలైన భద్రతాపరమైన చర్యలను పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని భద్రతా చర్యలను తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డీఆర్వో విజయ్‌కుమార్‌, నెల్లూరు ఆర్డీఓ అనూష, తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి

నామినేషన్ల స్వీకరణ

నెల్లూరురూరల్‌: నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 19న ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన, 21 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. 28న ఉద యం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌, 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నట్లు జేసీ తెలిపారు.

ఎంపీటీసీల

రిజర్వేషన్లు ఖరారు

నెల్లూరు(పొగతోట): జిల్లాలో ఎంపీటీసీల రిజర్వేషన్ల ప్రక్రియను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. జిల్లాలోని 35 మండలాల్లో 440 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎస్టీలకు 48, ఎస్సీలకు 108, బీసీలకు 56, ఓసీలకు 228 కేటాయించారు. ఎస్టీ జనరల్‌ 30, ఎస్టీ మహిళ 18, ఎస్సీ జనరల్‌ 59, ఎస్సీ మహిళ 49, బీసీ జనరల్‌ 27, బీసీ మహిళ 29, అన్‌రిజర్వ్‌డ్‌ జనరల్‌ 112, అన్‌రిజర్వ్‌డ్‌ మహిళకు 228 కేటాయించారు.

నిలిచిన ఆన్‌లైన్‌ సేవలు..

ఆందోళనలో అభ్యర్థులు

నెల్లూరు(పొగతోట): సచివాలయాలు, మీ సేవల్లో కుల ధ్రువీకరణలకు దరఖాస్తు చేసుకునే పోర్టల్‌ పని చేయకపోవడంతో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆరు నెలలోపు అధికారులు మంజూరు చేసిన కులధ్రువీకరణలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అంతకుముందు తీసుకున్నవి పనికిరావు. దీంతో సచివాలయాలు, మీసేవల వద్దకు అభ్యర్థులు పరుగులు తీస్తున్నారు. అయితే సేవల పోర్టల్‌ పనిచేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కులధ్రువీకరణ పత్రాల సేవల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని, పని చేయకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసే వారికి మాత్రమే మ్యాన్యువల్‌గా అందజేసేలా తహసీల్దార్లకు ప్రత్యేక ఆదేశాలు ఇస్తామని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement