నెల్లూరు(పొగతోట):గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో మహిళలకు పెద్దపీట వేసింది. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక శాతం మంది మహిళలకు సీట్లు కేటాయించి గెలిపించి రాజకీయంగా ప్రోత్సహించారు. 2021 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వంటింటికే పరిమితమైన గృహిణి ఆనం అరుణమ్మను జెడ్పీటీసీని చేసి జెడ్పీ పీఠంపై కూర్చోబెట్టారు. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను అధిక శాతం మహిళలకే కేటాయించారు. వారు రాజకీయంగా ఎదిగేలా పూర్తి సహాయ సహకారాలు అందించారు. దీంతో జిల్లాలో వందలాది మంది మహిళలు రాజకీయంగా ఎదిగారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి. 46 జెడ్పీటీసీ స్థానాల్లో 24 సీట్లు మహిళలకు కేటాయించారు. 24 మంది జెడ్పీటీసీలుగా విజయం సాధించారు. 46 ఎంపీపీ స్థానాల్లో 31 సీట్లు మహిళలకు కేటాయించారు. 31 మంది విజయం సాధించారు. 554 ఎంపీటీసీ స్థానాల్లో 322 సీట్లను మహిళలకు కేటాయించగా అందరూ గెలుపొందారు. జిల్లా వ్యాప్తంగా 941 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 941 సర్పంచ్ స్థానాల్లో 543 సీట్లు మహిళలకు కేటాయించారు. 543 మంది విజయం సాధించారు. 8,804 వార్డుల్లో 4,860 స్థానాలను మహిళలకు కేటాయించారు. 4,860 మంది మహిళలు గెలుపొందారు. జిల్లా పరిషత్, గ్రామ పాలనలో మహిళలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2026 స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది.


