పొదలకూరు : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. ప్రభుత్వ జాగా కనిపిస్తే అక్రమార్కులు వాలిపోతున్నారు. అధికారం అండతో దర్జాగా కబ్జా చేసి కంచెలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన అధికార యంత్రాంగం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధికారం అండతో..
మండలంలోని డేగపూడిలో ఎస్టీ కాలనీకి ఎదురుగా చెరువు కలుజు భూమి ఉంది. పొదలకూరు–రాపూరు ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ భూమిపై కన్నేసిన అక్రమార్కులు దర్జాగా ఆక్రమించారు. ఏకంగా కంచెను సైతం ఏర్పాటు చేశారు. అయినా గ్రామరెవెన్యూ అధికారి చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో గ్రామస్తులు మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూ ఆక్రమణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.15 లక్షల విలువైన 99 సెంట్ల భూమి ఆక్రమణ వ్యవహారం వెనుక అధికార పార్టీకి చెందిన ఉద్యోగి పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంచె వేసిన భూమి సర్వే నంబరును రెవెన్యూ రికార్డుల్లో పరిశీలిస్తే ప్రభుత్వ భూమిగానే చూపుతోంది. ఆక్రమణల పర్వంపై రెవెన్యూ అధికారులు నిగ్గు తేల్చాల్సి ఉంది.
ప్రభుత్వ భూమే
డేగపూడిలో ఆక్రమణకు గురైన భూమి ఎల్పీ నంబర్ 413, పాత సర్వే నంబర్ 252–బీ పరిధిలో ఉంది. ఇందులో చెరువు కలుజుకు సంబంధించిన భూమి కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. భూమి వాస్తవ స్వరూపం, యాజమాన్యం, సరిహద్దులు, రెవెన్యూ రికార్డులను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉండగా వీఆర్వో పరిశీలించి ప్రభుత్వ భూమిగా నిగ్గుతేల్చారు. చెరువు కలుజు ప్రవాహానికి సంబంధించిన భూమి ఆక్రమణకు గురైతే భవిష్యత్లో నీటి పారుదల వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూ ఆక్రమణపై పెద్ద ఎత్తున విమర్శలు, ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ యంత్రాంగం కదిలింది. ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూమిగా నిర్ధారించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు.
డేగపూడి చెరువు కలుజు భూమికి ఎసరు
సుమారు రూ.15లక్షల విలువైన 99 సెంట్లు ఆక్రమణ
టీడీపీకి చెందిన ప్రభుత్వ
ఉద్యోగిపై ఆరోపణలు


