సీతారామపురం : పేదింటి కందిపప్పు ఉడకడం లేదు. రేషన్ దుకాణాల ద్వారా అన్ని రకాల సరుకులను పంపిణీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కందిపప్పు సరఫరాకు మంగళం పాడింది. రెండున్నరేళ్ల వ్యవధిలో ఒకటి, రెండు నెలలు మాత్రమే అరకొరగా పంపిణీ చేసింది. ఆ తరువాత బియ్యం, పంచదార మినహా ఇతర సరుకులు ఇవ్వడంలేదు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు మండిపోతుండడంతో కొనలేక పేదలు పచ్చడి మెతుకులతో కడుపులు నింపుకొంటున్నారు.
ఒకటి, రెండు నెలలే..
ఎన్నికల సమయంలో చౌకదుకాణాల ద్వారా అన్ని రకాల సరుకులను పంపిణీ చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక బియ్యం, పంచదార పంపిణీకే పరిమితమైంది. కందిపప్పును ఒకటి, రెండు నెలలు మాత్రమే అరకొరగా అందజేసింది. ఆ తరువాత ఎప్పటికప్పుడు ఈ నెల నుంచి కందిపప్పు ఇస్తున్నామని ప్రకటనలు చేస్తూ ఊరించడమే తప్ప పంపిణీ చేయడం లేదు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నుంచే జిల్లాకు కందిపప్పు కేటాయింపులు లేకపోవడంతో డీడీలు తీయడం లేదని డీలర్లు చెబుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర కిలో రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. అధిక ధరలకు కందిపప్పును కొనుగోలు చేయలేక పేద, మధ్యతరగతి ప్రజలు సతమతమవుతున్నారు. దసరా పండగకు అయినా రేషన్లో కందిపప్పు అందజేస్తారని పేదలు భావించారు. కానీ బియ్యం, పంచదార మినహా కందిపప్పు ఇవ్వకపోవడంతో పండగక్కి కూడా పప్పన్నం లేదని వారు వాపోతున్నారు.
గత వైఎస్సార్సీపీ
ప్రభుత్వంలో..
జిల్లాలోని 36 మండలాల్లో 1,470 రేషన్ షాపులు ఉన్నాయి. వాటి పరిధిలో 7,10,449 తెల్ల రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెలా సుమారు 720 టన్నుల కందిపప్పు అవసరం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దే బియ్యం, పంచదారతో పాటు కందిపప్పును అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎండీయూ వాహనాలను రద్దు చేసింది. దీంతో రేషన్ దుకాణాల వద్దకే వెళ్లి లబ్ధిదారులు సరుకులు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
జిల్లాలో 7,10,449 తెల్లరేషన్ కార్డులు
ప్రతి నెలా 720 టన్నులు అవసరం
ఎన్నికల సమయంలో అన్ని రకాల సరుకులు ఇస్తామని కూటమి హామీ
అధికారంలోకి వచ్చాక
రెండు నెలలే కందిపప్పు సరఫరా
బహిరంగ మార్కెట్లో
మండుతున్న ధరలు
పచ్చడి మెతుకులతో
కడుపులు నింపుకొంటున్న పేదలు


