● 1500 మందితో బందోబస్తు
● 874 మంది బైండోవర్
● ఎస్పీ అజిత వేజెండ్ల
నెల్లూరు(క్రైమ్): స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ అజిత వేజెండ్ల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల్లోఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచడంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. రౌడీషీటర్లు, ట్రబుల్మాంగర్స్, గత ఎన్నికల కేసుల్లోని నిందితుల కదలికలపై నిశిత నిఘా ఉంచామన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 874 మందిని బైండోవర్ చేశామన్నారు.
44 నామినేషన్ కేంద్రాలు
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 20, ఆత్మకూరులో 13, బుచ్చిరెడ్డిపాళెంలో 11 నామినేషన్ కేంద్రాల వద్ద 220మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరులో 35 సమస్యాత్మక, 8 అతిసమస్యాతక, బుచ్చిరెడ్డిపాళెంలో ఎనిమిది సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు. పరిస్థితులకు అనుగుణంగా అదనపు బలగాలను మోహరించనున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో రూట్మార్చ్ నిర్వహించి ఎన్నికల్లో ప్రతిఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునేలా భరోసా కల్పిస్తామన్నారు.
1500 మందితో బందోబస్తు
స్థానిక సంస్థలకు జిలా వ్యాప్తంగా 1500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముందస్తు తనిఖీలు, అనుమానితుల కదలికలపై నిఘా చర్యలను ముమ్మరం చేయాలని పోలీసు అఽధికారులను ఆదేశించామని తెలిపారు.
ఎన్నికల నియమావళిని పాటించాలి
ఎన్నికల నియమావళిని ప్రతిఒక్కరూ పాటించాలని ఎస్పీ సూచించారు. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత ఎన్నికలకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


