● ఆశా కార్యకర్త మృతితో విషాదం
ఆత్మకూరు: ఆర్టీసీ బస్సు దిగుతుండగా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆశా కార్యకర్త చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. ఏఎస్పేట మండలం తెల్లపాడు గ్రామానికి చెందిన లెక్కల మహాలక్ష్మి (38) ఆశా కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 13వ తేదీన ఆత్మకూరులో జరిగిన సమావేశంలో పాల్గొని స్వగ్రామానికి బస్సులో బయలుదేరారు. ఊరిలో ఇద్దరు ప్రయాణికులు దిగారు. తర్వాత మహాలక్ష్మి దిగుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు కదిలించాడు. దీంతో ఆమె బోర్లాపడి తలకు తీవ్రగాయమైంది. వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. మృతురాలికి భర్త వెంకటరమణారెడ్డి, ఇద్దరు పిల్లలున్నారు.
● మూడునెలల క్రితం పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద ఓ వృద్ధుడి పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటనను ప్రజలు గుర్తుచేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఆర్టీసీ ఉన్నతాధికారులు డ్రైవర్లపై పర్యవేక్షణ పెంచి, ప్రయాణికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


