నెల్లూరు(టౌన్): విజయనగరంలోని రామనారాయణపురం దేవాలయం మైదానంలో ఈనెల 27 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన 46వ ఎన్‌టీపీసీ జూనియర్ రికర్వ్ రౌండ్ ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీల్లో గూడూరుకు చెందిన ఎస్‌ఎస్ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు సత్తా చాటారు. నలుగురు క్రీడాకారులు పతకాలు సాధించి జాతీయ పోటీలకు ఎంపికై నట్లు ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పల్లంరెడ్డి శ్రీహర్ష, పావురాల వేణు సోమవారం తెలిపారు. తరుణీష్ జాత్యా ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించగా, కె.చరిత ద్వితీయ స్థానంతో రజత పతకం, ఆర్.సాయి మౌర్య, రాజేష్ తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించారన్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో వచ్చే నెల 21 నుంచి 28వ తేదీ వరకు జరిగే 46వ ఎన్‌టీపీసీ జూనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. క్రీడాకారులను తీర్చిదిద్దిన జిల్లా ఆర్చరీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోచ్ శివకుమార్, మేనేజర్ భరద్వాజ్‌ను అభినందించారు.


