● డీఅడిక్షన్ కేంద్ర సిబ్బందికి
ఆరునెలలుగా వేతనాల్లేవు
● పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలైన వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ప్రక్రియకు ప్రభుత్వ విధానాలతో గండి పడుతోంది. నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి డీఅడిక్షన్ సెంటర్ (మత్తు విముక్తి కేంద్రం)లో పనిచేసే డాక్టర్, ఇతర సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు ఇవ్వని దుస్థితి నెలకొంది. దీంతో వారు ఆకలితో జీవిస్తూ అప్పుల పాలవుతున్నా వారి జీతాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.
నెల్లూరు(అర్బన్): మద్యం, గంజాయి, గుట్కా లాంటి మత్తు పదార్థాలకు బానిసలైన వారిని మళ్లీ మామూలు మనిషిని చేసేందుకు నగరంలోని సర్వజన ఆస్పత్రిలో సైకియాట్రి విభాగం ఆధ్వర్యంలో డీఅడిక్షన్ సెంటర్‌ను ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసింది. అందులో పని చేసేందుకు గత మార్చి నెలలో ఒక మెడికల్ ఆఫీసర్(డాక్టర్), ప్రాజెక్టు ఆఫీసర్, కౌన్సిలర్, స్టాఫ్ నర్సు, ఎంఎన్‌ఓ, అటెండర్, చౌకీదార్, వార్డ్‌బాయ్, ప్రీ–ఎడ్యుకేటర్‌లను ఒక్కో పోస్టుకు ఒక్కరు చొప్పున అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. నియామక పత్రాలిచ్చి విధుల్లో చేర్చుకుని ఆరు నెలలు గడిచినా జీతాలు మాత్రం ఇవ్వడం లేదు.
జీతాలిలా..
ఒక్క మెడికల్ ఆఫీసర్‌కు మాత్రం రూ.60 వేలు, కౌన్సిలర్‌కు రూ.17,500, ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌కు రూ.12,500, అటెండర్‌కు రూ.12,000, స్టాఫ్ నర్సుకు రూ.15 వేలు, ఎంఎన్‌ఓకు రూ.12 వేలు, ప్రీఎడ్యుకేటర్, చౌకీదార్, వార్డు బాయ్‌లకు రూ.10 వేల చొప్పున జీతాలు ఇస్తారు.
జీతం బెత్తెడు.. చాకిరి బారెడు
ఇక్కడ పనిచేస్తున్న వారికి అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అనే ఆశతో వీరంతా పని చేస్తున్నారు. మత్తు మందులకు బానిసైన వారికి వీరు వైద్యం చేయాలి. మత్తుకు బానిసైన వారికి ప్రత్యేక వార్డు కేటాయించారు. వార్డుకు గంజాయి బ్యాచ్‌లాంటి పేషెంట్లు వస్తున్నారు. వీరితో మంచిగా మాట్లాడటం, వైద్యం చేయడం చాలా కష్టం. అయినా వీరంతా ఉదయం నుంచి రాత్రి వరకు మత్తుకు బానిసైన వారిని మామూలు మనుషులుగా మార్చేందుకు విశ్వప్రయత్నం చేస్తారు. మద్యం మానేసేటప్పుడు వచ్చే వణుకు, నిద్రలేమి వంటి వాటికి మందులిస్తారు. మనస్సును నియంత్రించేందుకు యోగా, మెడిటేషన్ నేర్పిస్తారు. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తారు. అలాగే ఎలా వైద్యం చేస్తున్నారో.. ఎంతెంత డోసు మాత్రలు, ఇంజెక్షన్‌లు ఇస్తున్నారో వివరంగా రికార్డుల్లో రాయాలి. ఇంత చేసినా వైద్యసిబ్బంది బతుకులు జీతం బెత్తెడు... చాకిరి బారెడు అనే చందంగా తయారైంది. చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోలేక అల్లాడుతున్నారు.
అప్పుల పాలవుతున్నారు
ఆరు నెలలుగా జీతాలు లేకపోవడంతో సిబ్బంది అప్పులు తెచ్చుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. అర్ధాకలితో అలమటిస్తున్నారు. విధులకు వచ్చేందుకు కూడా చేతిలో చిల్లిగవ్వకూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు జీతాలు ఇప్పించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి, అడ్మినిస్ట్రేషన్ అధికారి ఏడుకొండలు చుట్టూ తిరుగుతున్నారు. మానసిక, మత్తు పదార్థాల పేషెంట్లకు వైద్యం చేస్తూ.. మరోపక్క మానసికంగా వేదనను అనుభవిస్తున్నారు.
వెంటనే జీతాలివ్వాలి
ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతినెలా 1వ తేదీన తమకు జీతాలిచ్చేలా చర్యలు చేపట్టాలని, ఆరునెలల జీతాన్ని ఒకే దఫా విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారి(ఏడీ) ఏడుకొండలును వివరణ కోరగా విషయాన్ని డీఎంఈ దృష్టికి తీసుకెళ్తామన్నారు.


