నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రక్రియను పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని డీపీఓ వెంకటరామన్ మండలాధికారులను ఆదేశించారు. ఆయన జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి స్థానిక ఎన్నికలకు సంబంధించి మండలాధికారులతో శనివారం టెలి కాన్ఫరెన్స్ జరిపారు. పోలింగ్ బూత్‌లు, ఓటర్ల జాబితాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులిచ్చిన వెంటనే పంచాయతీల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియ నిర్వహించే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పోలింగ్ బూత్‌ల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు.
ఘనంగా జిల్లాస్థాయి
క్రీడా ఎంపికలు
నెల్లూరు (టౌన్): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు శనివారం ఘనంగా జరిగాయి. అండర్–17 అథ్లెటిక్స్‌లో, అండర్–14, 17 ఫుట్‌బాల్‌లో, అండర్–19 సాఫ్ట్‌బాల్‌లో బాల, బాలికలకు ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు విజయవంతం చేసిన వ్యాయామ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 5వ తేదీ జరగాల్సిన వివిధ రకాల క్రీడా ఎంపికలను ఇంటర్, హైస్కూల్ విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో వాయిదా వేసినట్లు చెప్పారు. క్రీడలు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై త్వరలో ప్రకటిస్తామన్నారు.
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
రాపూరు: మండలంలోని పెంచలకోనలో వెలసిన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి నిత్యాన్నదాన పథకానికి శనివారం బద్వేల్‌కు చెందిన చాటకొండు నరసింహులు రూ.1,00,116లు అందించినట్లు ఏసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. దాతలకు మూడు ఆలయాల్లో ప్రత్యేక దర్శనాలు కల్పించి, తీర్థప్రసాదాలు, శేష వస్త్రం అందించినట్లు వివరించారు.
అర్జీలను గడువులోగా పరిష్కరించాలి
● డీఆర్వో విజయ్‌కుమార్
నెల్లూరురూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి, పీజీఆర్‌ఎస్ నోడల్ ఆఫీసర్ విజయకుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారులు తమ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న అర్జీలతో పాటు నేరుగా అందిన అర్జీలను కూడా ప్రతిరోజూ పరిశీలించాలన్నారు. అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
చికెన్ వేస్ట్ నిర్వాహకుల బెదిరింపులు
వెంకటాచలం: చికెన్ వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారని ప్రశ్నించిన వారిపై నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడిన ఘటన వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. గూడూరు వైపు నుంచి నెల్లూరు వైపు చికెన్ వ్యర్థాలతో బొలెరో వాహనం వెళ్తోంది. ఈవిషయాన్ని అటుగా వెళ్లే ప్రయాణికులు గుర్తించి టోల్‌ప్లాజా వద్ద ఆపి ఎక్కడికి వ్యర్థాలను తరలిస్తున్నారని ప్రశ్నించారు. అయితే బొలెరో డ్రైవర్ ఈ విషయాన్ని వ్యర్థాలను తరలించే వారికి తెలియజేయడంతో నిర్వాహకులు ప్రశ్నించిన వారిని ఫోన్‌లో బెదిరించారు. ఈ విషయంపై వెంకటాచలం పోలీసులకు బాధితులు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.


