నెల్లూరు(పొగతోట): కాలుష్య నిబంధనలను రైస్ మిల్లర్లు తప్పనిసరిగా పాటించాలని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ అశోక్‌కుమార్ అన్నారు. నగరంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఈఈ మాట్లాడారు. నగర పరిధిలోని 64 రైస్ మిల్లుల యజమానులు నిబంధనలను తప్పక పాటించాలన్నారు. కాలుష్యాన్ని నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రైస్ మిల్లుల నుంచి వస్తున్న కాలుష్యం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారన్నారు. నగర పరిధిలో 33 రైస్ మిల్లుల్లో మాత్రమే కాలుష్యాన్ని అరికట్టే విధంగా యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారని, మిగిలిన మిల్లుల్లోనూ కాలుష్యాన్ని అరికట్టే యంత్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. దుమ్మును నివారించే పరికరాలు ఏర్పాటు చేసేంత వరకు బ్రాయిలర్లను నడపవద్దన్నారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు సుబ్రహ్మణ్యంరెడ్డి, రంగయ్యనాయుడు, కోటేశ్వరరావు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.


