● ట్రాక్టర్‌పై నుంచి పడి గిరిజన కూలీ మృతి
మనుబోలు: పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన ఓ గిరిజనుడు ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడి చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సంగమేశ్వర కాలనీకి చెందిన యనమల శేషయ్య అలియాస్ ఆకాష్(28) కూలి పనుల్లో భాగంగా శనివారం ఉదయం ట్రాక్టర్‌లో బద్దెవోలు గ్రామానికి వెళ్లి అక్కడ ఇటుకలు దించి తిరిగి వస్తున్నాడు. చేపల గుంతల మలుపు వద్ద ట్రాక్టర్ కుదుపులకు గురవడంతో వెనుక భాగంలో కూర్చుని ఉన్న శేషయ్య కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య వెంకటరమణమ్మ, మూడేళ్ల కుమారుడు సతీష్ ఉన్నారు. ఇంటికి ఆధారంగా ఉన్న వ్యక్తి చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


