● కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి
నెల్లూరురూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ కుట్రలు, దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉందని, వాటికి అడ్డుకట్ట వేయాలని వైఎస్సార్‌సీపీ నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కలెక్టర్ హిమాన్షు శుక్లాను కోరారు. ఈ మేరకు శనివారం వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి కలెక్టరేట్‌లో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలను కలెక్టర్‌కు వివరించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో అధికార పార్టీ కుతంత్రాలకు పాల్పడుతోందన్నారు. ఇష్టారీతిన ఓటర్ల జాబితాలను రూపొందించి కొంతమంది ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని విమర్శించారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులు, నిర్బంధాల విషయాన్ని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. పోలింగ్ రోజున కూడా అధికార పార్టీ బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉందని, వాటిని అడ్డుకోవాలని కోరారు.
బీసీలను మోసం చేస్తున్న ప్రభుత్వం
బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం మోసం చేస్తోందని పర్వతరెడ్డి విమర్శించారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిపై సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో జీఓలు జారీ చేయడం, వాటిని హైకోర్టు కొట్టివేసిన తర్వాత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పడం బీసీలను మరోసారి మోసం చేయడమేనన్నారు. బీసీల ఓట్ల కోసమే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. బీసీలు ఇప్పటికైనా ఆలోచించి ఇలాంటి కుట్రలను తిప్పుకొట్టాలని కోరారు.
వైఎస్సార్, జగనన్న హయాంలోనే న్యాయం
అప్పట్లో వైఎస్సార్, మొన్న జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే బీసీలకు మంచి జరిగిందని పర్వతరెడ్డి గుర్తు చేశారు. జనరల్ సీట్లలో కూడా బీసీలకు ఇచ్చారంటే వారి గురించి జగన్‌మోహన్‌రెడ్డి ఎంతగా ఆలోచించారో అర్థం చేసుకోవాలన్నారు. అధికార పార్టీ ఆగడాలను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ మరింత దూకుడుగా ముందుకు సాగుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికితీసి న్యాయస్థానాల ముందుంచుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


