నెల్లూరు(వీఆర్సీసెంటర్): నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ సుందరయ్య కాలనీ, సీ డీ బ్లాక్‌లలో ప్రభుత్వం ఇచ్చిన బీఫామ్ పట్టాలకు బదులుగా రిజిస్ట్రేషన్ పట్టాలు, అర్హులైన వారికి స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు, పెంచలనరసయ్య డిమాండ్ చేశారు. సుందరయ్యకాలనీ సచివాలయం వద్ద శనివారం స్థానిక ప్రజలతో కలిసి వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్న పేద, మధ్య తరగతి ప్రజలకు రిజిస్ట్రేషన్ పట్టాలిచ్చేందుకు పాలకులు, అధికారులు మీనమేషాలు లెక్కి స్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం, ప్రజానాట్య మండలి నాయకులు వీర్ల శ్రీనివాసులు, సురేష్, సుధీర్, షాహినాబేగం, సుధాకర్, మల్లికార్జున, అభిషేక్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


