దుత్తలూరు(ఉదయగిరి): మండలంలోని నందిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించాల్సిన ఎస్సెమ్సీ ఎన్నికను కోరం లేక వాయిదా వేశారు. తాజాగా జరిపిన ప్రక్రియలో 200 మంది తల్లిదండ్రులకు గానూ 105 మంది హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుకు 62.. టీడీపీ తరఫు వారికి 35 ఓట్లొచ్చాయి. దీంతో పచ్చ పార్టీ వర్గీయులు ఒక్కసారిగా ఎన్నిక జరుగుతున్న హాల్లోకి ప్రవేశించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలక్షన్ జరగనీయకుండా అడ్డుకునేందుకు సైకిల్ శ్రేణులు యత్నించడం.. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం చెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పేందుకు యత్నించారు. ఏమి జరుగుతోందో అర్థం కాక తల్లిదండ్రులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. దీంతో ఎన్నికను వాయిదా వేశారు.
పోలీసుల తీరుపై నిరసన
ఎన్నికల గది ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో నందిపాడు ఎస్సీ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు.. అందులోకి వెళ్తుండగా, పోలీసులు చేయిచేసుకోవడంతో పరిస్థితి తీవ్రమైంది. ఎస్సై మహేంద్ర తీరును నిరసిస్తూ యువకుడి మద్దతుదారులు బైఠాయించారు. స్థానిక పెద్దలు జోక్యం చేసుకొని రాజీ చేశారు.


