సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని పణంగా పెట్టి కొందరు కూటమి నేతలు చికెన్ వేస్ట్ మాఫియాగా రూ.కోట్లల్లో దోచుకుంటున్నారు. చేపల సాగులో చికెన్ వేస్ట్‌ను ఫీడ్‌గా సరఫరా చేస్తూ టీడీపీ నేతలు కాసులు పిండు కుంటున్నారు. ప్రజారోగ్యం దెబ్బతిన్నా మా జేబులు నిండితే చాలన్నట్లుగా తమ్ముళ్లతోపాటు పోలీసులు, మత్స్యశాఖ అధికారులు బరి తెగిస్తున్నారు. చికెన్ వేస్ట్ మురుగు జలాలతో ప్రజల దాహార్తిని తీర్చే పెన్నానదిని సైతం కలుషితం చేస్తున్నారు. చేపలు సాగు చేసే పరిసరాల్లోనే భూగర్భ జలాలు సైతం కలుషితంగా మారుతున్నాయి. చికెన్ వేస్ట్ కారణంగా పర్యావరణం కూడా దెబ్బతింటుంది.
జిల్లాలో 2 వేల ఎకరాలకుపైగా సాగు
జిల్లాలో ఆత్మకూరు, సంగం, కోవూరు, ఇందుకూరుపేట, విడవలూరు, ముత్తుకూరు, తోటపల్లిగూడూ రు, బుచ్చిరెడ్డిపాళెం, సంగం ప్రాంతాల్లో 2 వేల ఎకరాల్లో చేపల పెంపకం జరుగుతోంది. అయితే చేపలకు వినియోగించే ఫీడ్ (ఆహారం) ఖరీదు కావడంతో వీటి పోషణ రైతులకు భారంగా మారింది. సాధారణంగా చేపలు ఒక కేజీ పైబడి పెరగడానికి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు పడుతోంది. ఇందు కోసం రెండు కేజీల బ్రాండెడ్ ఫీడ్ వినియోగించాల్సి ఉంటుంది. అదే చేపల మేతగా బ్రాండెడ్ ఫీడ్‌కు బదులు, ప్రత్యామ్నాయంగా అతి తక్కువ ఖర్చుతో కూడిన కోళ్ల వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్నారు. వీటితో నాలుగు నెలలకే కేజీ, అంతకు మించిన బరువు పెరుగుతున్నాయి.
ఖర్చు తక్కువ.. రాబడి ఎక్కువ
ఒక ఎకరంలో చేపల సాగుకు ఆరు టన్నుల ఫీడ్ అవసరం కాగా, ప్రస్తుతం టన్ను బ్రాండెడ్ ఫీడ్ రూ.35 వేల వరకు ఉంది. ఈ లెక్కన ఒక ఎకరానికి రూ.2.10 లక్షలు ఖర్చు అవుతుంది. అదే చికెన్ వేస్ట్ అయితే.. కేజీ చేప పెరగడానికి నాలుగు కేజీలు వినిగిస్తున్నారు. ఈ లెక్కన ఎకరంలో చేపల సాగుకు 12 టన్నుల చికెన్ వేస్ట్ అవసరం కాగా, టన్ను రూ.15 వేలు ఉంది. ఈ లెక్కన ఎకరానికి ఎకరానికి రూ.1.80 లక్షల ఖర్చు అవుతుంది. చికెన్ వేస్ట్‌ను ఫీడింగ్‌గా వినియోగించే చేపలు కేవలం 4 నెలల్లోనే కేజీ నుంచి కేజీన్నర వరకు పెరుగుదల ఉండడంతో రైతులకు లాభసాటిగా ఉంటుంది. ఈ లెక్కన కేజీ–కేజీన్నర చేప పెరుగుదలకు రూ.40 నుంచి రూ.60 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం కేజీకి పైబడిన చేపలు అయితే కేజీ రూ.120లకు, ముప్పావు నుంచి కేజీ వరకు ఉంటే కేజీ రూ.104లకే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు.
నాలుగు నెలల సీజన్‌లో రూ.24 కోట్ల రాబడులు
కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, సంగం, సర్వేపల్లి నియోజ కవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలు చికెన్ వేస్ట్ మాఫియాగా తయారయ్యారు. మత్స్యశాఖ, పోలీసులకు నెలకు రూ.లక్షల్లో మామూళ్లు ఇచ్చుకుంటూ రూ.కోట్లల్లో దోచు కుంటున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక మహా నగరాల్లో వేస్ట్‌గా నిర్వీర్యం చేసే కోళ్ల వ్యర్థాలను సేకరించి జిల్లాకు తెచ్చి ఈ మాఫియా విక్రయాలు చేస్తోంది. అక్కడ కేజీకి ఐదారు రూపాయలకు కొనుగోలు చేసి ఇక్కడ రూ.15లకు విక్రయిస్తున్నారు. జిల్లాలో సాగవుతున్న చేపలకు నెలకు సగటున 6 వేల మెట్రిక్ టన్నులు, నాలుగు నెలలకు సుమారు 24 వేల మెట్రిక్ టన్నుల చికెన్ వేస్ట్‌ను వినియోగిస్తున్నారు. ఈ లెక్కన కేజీకి రూ.10 వంతున రూ.24 కోట్ల ఆదాయాన్ని పొందుతున్నారు.
చేపల సాగు
గుంతలో తేలిన చికెన్ వేస్ట్
కేన్సర్, జీర్ణాశయం, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యుల హెచ్చరిక
జిల్లాలో 2 వేల ఎకరాలకుపైగా చేపల సాగు, వీటికి చికెన్ వేస్టే ఫీడింగ్
ఒక్క ఎకరాకు 12 టన్నుల లెక్కన 24 వేల మెట్రిక్ టన్నుల వినియోగం
కోవూరు, ఆత్మకూరు, సర్వేపల్లిల్లో
విచ్చలవిడిగా వినియోగం
ఇంత పెద్ద అధికార యంత్రాంగం ఉండీ కట్టడి చేయలేకపోతున్న వైనం
నెలకు రూ.6 కోట్ల ఆదాయం
శాసిస్తున్న చికెన్ వేస్ట్ మాఫియా
ప్రాణాంతక వ్యాధులు
ఆయా రాష్ట్రాల్లో సేకరించిన చికెన్ వేస్ట్‌ను రెండు.. మూడు రోజులు నిల్వ ఉంచడంతో కుళ్లి, పురుగులు పట్టి దుర్గంధం వెదజల్లుతోంది. ఇటువంటి కుళ్లిన చికెన్‌ను తెచ్చి నేరుగా చేపల సాగు చేసే చెరువుల్లో పోస్తున్నారు. వీటిని ఆహారంగా తిని పెరిగిన చేపలను తినడం వల్ల ఈకోలి బ్యాక్టీరియా కారణంగా ప్రాణాంతకమైన కేన్సర్, జీర్ణాశయం, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
కుళ్లిన చికెన్ వేస్ట్‌ను అర్ధరాత్రి తర్వాతనే వాహనాల్లో జిల్లాకు తరలిస్తున్నారు. ఆ సమయంలో తనిఖీలకు అవకాశం ఉండదనే ఉద్దేశంతో విచ్చలవిడిగా తరలిస్తున్నారు. ఆ వాహనం వచ్చినంత దూరం దుర్గంధం వెదజల్లుతోంది. ఇలాంటి వాహనాలు నేరుగా టోల్‌గేట్లు దాటి వస్తున్నా.. గుర్తించి వాటిని పట్టుకునే చర్యలు తీసుకోకపోవడంతో అడ్డూ అదుపు ఉండడం లేదు. చికెన్ వేస్ట్ మాఫియా భారీ ఎత్తున నెల మామూళ్లు ఇస్తుండడంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడపాదడపా ఒకటీ.. అర పట్టుకుని నిఘా పెట్టాము.. కట్టడి చర్యలు తీసుకుంటున్నామంటూ అధికారులు కంటితుడుపుగా పనిచేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.
టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశాం
జిల్లాలో చేపల చెరువుల్లో చికెన్ వేస్ట్ వినియోగంపై ఇప్పటికే రైతులను హెచ్చరించడం జరిగింది. అన్ని మండలాల్లో తహసీల్దారు, ఎస్‌ఐతోపాటు రవాణా శాఖ, ఫిషరీస్ అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశాం. ఎప్పటికప్పుడు సమాచారం అందితే తనిఖీ చేపట్టి వాటిని నిర్వీర్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో కళ్లుగప్పి వచ్చిన వాహనాలను సైతం చేపల గుంతల వద్ద పట్టుకుంటున్నాం. – లక్ష్మణ్‌రావు, ఫిషరీస్ జేడీ


