ప్రకృతి పగకు.. సర్కారు నిర్లక్ష్యం తోడై సింహపురిలో దుర్భిక్ష ఛాయలు అలముకున్నాయి. ధాన్యపు సిరికి, డెల్టా ప్రాంతంగా పేరున్న జిల్లాపై ‘ఎల్లో’ నినో సృష్టించిన కరువు పంజా విసిరింది. జలసిరికి నెలవైన సింహపురి కరువు కోరల్లో చిక్కుకుందనడానికి ప్రస్తుత పరిస్థితులే నిదర్శనంగా నిలుస్తాయి. ఒక వైపు లోటు వర్షపాతం వెంటాడుతుంటే.. మరో వైపు అందుబాటులో ఉన్న జలవనరులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నల పాలిట శాపంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీశైలంలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉండడంతో కృష్ణా జలాలను జిల్లాకు తరలించే అవకాశాలున్నా.. జలాశయాలను నింపేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అపార జలసంపద, ధాన్యపు సిరులతో అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన నెల్లూరు.. కరువు కోరల్లో చిక్కుకుంది. డెల్టా ప్రాంతంలో సైతం కరువు కమ్ముకున్నట్లు అధికా రిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలోని 36 మండలాల్లో 35 మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. ఇది ప్రకృతి సృష్టించిన విపత్తు అయితే.. శ్రీశైలం జలాశయంలో సమృద్ధిగా ఉన్న నీటిని తరలించి.. కరువును తరిమి కొట్టే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జలాశయాలు, జలవనరులు బావురుమంటున్నాయి. ఇది ‘ఎల్లో’ నినో సృష్టించిన ‘మహావిపత్తు’గా చెప్పొచ్చు.
జిల్లాలో 78 టీఎంసీల సామర్థ్యమున్న సోమశిల, 69 టీఎంసీల కండలేరు వంటి భారీ జలనిధులతో పాటు మరో 50 నుంచి 60 టీఎంసీలు నిల్వ సామర్థ్యం కలిగిన పలు చెరువులు, జలవనరులు ఉన్నా.. దుర్భిక్ష పరిస్థితులు తీవ్రంగా నెలకొన్నాయి. వరికుంటపాడులో ఏకంగా 61.6 శాతం, అనంతసాగరంలో 68.4 శాతం లోటు వర్షపాతం నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 20 మండలాల్లో 20 నుంచి 59.9 శాతం వరకు లోటు వర్షపాతం నమోదు కాగా.. మరో 13 మండలాల్లో 19 శాతం లోటు వర్షాభావం నెలకొంది. జిల్లాలోని 35 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతుంటే.. అధికారులు మాత్రం 31 మండలాల్లోనే కరువు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదికలు పంపారు.
అడుగంటిన నిల్వలు
జిల్లాలో సోమశిల, కండలేరు ప్రధాన ప్రాజెక్ట్‌లతో పాటు కనిగిరి, సర్వేపల్లి రిజర్వాయర్లు, నెల్లూరు, సంగం బ్యారేజీలు కలిపి దాదాపు 200 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసుకునే విస్తృత సదుపాయం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 22 నాటికి సోమశిలలో 58 టీఎంసీలు, కండలేరులో 35 టీఎంసీలు కలిపి ఏకంగా 93 టీఎంసీల మేర నీరు అందుబాటులో ఉంది. అయితే సరైన నిర్వహణ, కార్యాచరణ లేకపోవడంతో కేవలం 1.80 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందించి, సుమారు 64 టీఎంసీల నీటిని వృథా చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సోమశిల, కండలేరుకు కృష్ణా నీటిని తరలించే సాంకేతిక సౌలభ్యం ఉన్నప్పటికీ ఆ ప్రయత్నాలు జరగకపోవడం సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రస్తుతం సోమశిల, కండలేరు డెడ్ స్టోరేజ్ మినహాయిస్తే వాడుకకు కేవలం 5 నుంచి 6 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
రాయలసీమ ఎత్తిపోతల పూర్తయినా..
రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయి ఉంటే.. తెలంగాణతో సమానంగా కాకపోయినా.. కొంత మేరైనా నెల్లూరుతోపాటు రాయలసీమ జిల్లాలకు నీటిని తరలించి కరువు వేళ సైతం సస్యశ్యాలం చేసే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భవిష్యత్ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని దూరదృష్టితో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నా.. ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించే అవకాశం ఉండేది. దాదాపు 85 శాతానికి పైగా పూర్తయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు సర్కారు ఆపేయడంతో శ్రీశైలంలో జల హక్కులు ఉన్నా.. వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడింది.
అడుగంటిన
కండలేరు జలాశయం
శ్రీశైలం నీటిపైనే నెల్లూరు ఆశలు
జిల్లాలో సగటున 40 శాతం లోటు వర్షపాతం కారణంగా దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావానికి తోడు నీటి నిర్వహణ లోపంతో తీవ్ర జల సంక్షోభం ఏర్పడింది. జిల్లా జలనిధులు సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో, ఇప్పుడు ఎగువనున్న కృష్ణా జలాలు తరలివస్తే తప్ప జిల్లా గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. శ్రీశైలం నుంచి నీటిని మళ్లించడంలో జరుగుతున్న జాప్యం ఇలాగే కొనసాగితే జిల్లా వ్యవసాయ రంగం ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 871 అడుగుల నీటి మట్టం ఉంది. ఈ తరుణంలో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులర్ కాలువ ద్వారా సోమశిల, కండలేరు జలాశయాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా.. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. శ్రీశైలంలో 841 అడుగుల కంటే నీటి మట్టం పెరిగితే.. రోజుకు 44 వేల క్యూసెక్కులు తరలించుకునే వెసులుబాటు ఉంది. ఈ లెక్కన రోజుకు కనీసం 4 టీఎంసీలు నీటిని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గ్రావిటీ ద్వారా జిల్లాలోని జలాశయాలను నింపే అవకాశం ఉంది. మరో వైపు తెలంగాణ సర్కారు 800 అడుగుల నీటి మట్టంలోనే శ్రీశైలం జలాలను తరలించుకుని పోతున్నా.. కూటమి ప్రభుత్వం కట్టడి చేయడం లేదు. శ్రీశైలంలో గరిష్ట స్థాయిలో నీటి నిల్వలు ఉన్నప్పుడైనా జిల్లా జలాశయాలు నింపే ఆలోచనను అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేయకపోవడంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి.
ధాన్యపు సిరి.. సింహపురి
డెల్టా ప్రాంతంగా ప్రసిద్ధి
78 టీఎంసీల సోమశిల, 69 టీఎంసీల కండలేరు వంటి జలనిధులు
సమృద్ధిగా వర్షాలు కురిస్తే 50 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసే
జలవనరులు
శ్రీశైలంలో సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నా.. జిల్లాలోని జలనిధులు నింపని సర్కారు నిర్లక్ష్యం
రాయలసీమ ఎత్తిపోతల పథకం సిద్ధమైనా.. అపార జల సంపద
కేవలం చంద్రబాబు సృష్టించిన ’ఎల్లో’ నినో కారణంగానే కరువు
జిల్లాలో 36 మండలాల్లో 35 మండలాల్లో కరువు పరిస్థితులు
31 మండలాల్లోనే కరువున్నట్లు వ్యవసాయ శాఖ నిర్ధారణ
వరికుంటపాడులో 61.6, అనంతసాగరం 68.4 శాతం లోటు వర్షపాతం
లోటు వర్షపాతం మండలాల
సంఖ్య
19 శాతం తక్కువ 13
20– 59.9 శాతం తక్కువ 20
60– 99.9 శాతం తక్కువ 2
20 శాతం కంటే ఎక్కువ 1


