గంధ మహోత్సవం.. భక్తి పారవశ్యం | - | Sakshi
Sakshi News home page

గంధ మహోత్సవం.. భక్తి పారవశ్యం

Sep 10 2026 12:09 AM | Updated on Sep 10 2026 12:09 AM

కసుమూరు, ఏఎస్‌పేటలో

వైభవంగా కార్యక్రమాలు

కసుమూరులో వసతుల్లేక భక్తుల అవస్థలు

దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న

కడప పీఠాధిపతి ఆరీపుల్లా హుస్సేనీ

వెంకటాచలం: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్‌వలీ దర్గా 249వ గంధ మహోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. దర్గాకు కిలోమీటర్‌ దూరంలోని చందన్‌మహాల్‌ నుంచి మంగళవారం అర్ధరాత్రి గుర్రంపై గంధాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. కాగా బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తలదాచుకునేందుకు సరైన వసతుల్లేక అవస్థలు ఎదుర్కొన్నారు. గంట తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో ఊరేగింపు తిరిగి కొనసాగింది. ఉదయం 7 గంటలకు గంధాన్ని దర్గా వద్దకు తీసుకొచ్చారు. అనంతరం కసుమూరు వీధుల్లో మేళతాళాల మధ్య ఊరేగింపు వైభవంగా సాగింది. దర్గా వద్ద కడప పీఠాధిపతి ఆరీపుల్లా హుస్సేనీ మస్తాన్‌వలీ సమాధిపై చద్దర్‌ కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం గంధం బిందెను దర్గా ముజావర్లకు అందజేయగా, వారు భక్తులకు పంపిణీ చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య తగ్గింది. తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.

దర్గాను సందర్శించిన ఏఆర్‌ రెహమాన్‌

ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌, ఇంకా శివమణి కసుమూరు దర్గాను సందర్శించారు.

వసతుల కల్పనలో వక్ఫ్‌ బోర్డు వైఫల్యం

భక్తులకు వసతులు కల్పించడంలో వక్ఫ్‌ బోర్డు అధికారులు విఫలమయ్యారు. ఈ ఏడాది గంధ మహోత్సవంపై సరైన ప్రచారం కూడా నిర్వహించలేదు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రూ.19 లక్షలతో ఏర్పాట్లు చేస్తున్నట్లు దర్గా ఈవో షరీఫ్‌ ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చందన్‌మహాల్‌ ప్రాంగణం, మస్తాన్‌వలీ దర్గా పరిసరాల్లో పారిశుద్ధ్యం లోపించింది. వర్షం కారణంగా కసుమూరు ప్రధాన వీధిలోని సైడ్‌ కాలువల మురుగునీరు రోడ్డుపైకి చేరడంతో దుర్వాసనతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. మొబైల్‌ టాయిలెట్లు కూడా పరిమిత సంఖ్యలోనే ఏర్పాటు చేయడంతో మహిళలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. గ్రామంలో సరైన లైటింగ్‌ లేక వీధులు చీకటిమయంగా మారాయి. రూ.19 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్న నేపథ్యంలో వాటిని ఏయే ఏర్పాట్లకు ఎంత ఖర్చు చేశారో అధికారులు వివరించాలని గ్రామస్తులు, భక్తులు డిమాండ్‌ చేశారు.

తహలీల్‌ ఫాతెహా నేడు

గంధ మహోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం తహలీల్‌ ఫాతెహా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు దర్గా ముజావర్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement