అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల కుదింపు | - | Sakshi
Sakshi News home page

అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల కుదింపు

Jun 20 2026 12:01 PM | Updated on Jun 20 2026 12:01 PM

మొదటి ఏడాది ఎగనామం

రెండో ఏడాదిలో గత ప్రభుత్వంలోని

లబ్ధిదారుల్లో 18,801 మంది తొలగింపు

మూడో ఏడాదిలో గతేడాది లబ్ధిదారుల్లో 18,321 మంది లబ్ధిదారులు కట్‌

ఈ దఫా తొలి విడతలో

1,77,545 మందికి మాత్రమే

వైఎస్సార్‌సీపీ హయాంలో 2,14,667 మందికి రైతు భరోసా

రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటూ కూటమి ఆ రైతును సంక్షోభంలోకి నెట్టేస్తోంది. అప్పట్లో వ్యవసాయమే దండగన్న చంద్రబాబు.. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని పథకం ప్రకారం కుప్పకూల్చేస్తున్నారు. రెండేళ్లకు ముందు అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి పంటకు అ‘ధర’హో అనే రీతిలో ధరలు లభించగా, కూటమి పాలనలో రెండేళ్లుగా ఏ పంటలకు కనీసం ‘మద్దతు’ ధర కూడా లభించడం లేదనేది నిర్వివాదాంశం. ఇక అన్నదాత సుఖీభవ పథకాన్ని చివరకు అన్నదాత దుఃఖీభవగా మార్చేసింది. తొలి ఏడాది ఎగనామం పెడితే.. రెండో ఏడాదిలో అమలు చేసినా గత ప్రభుత్వంలోని లబ్ధిదారులను భారీగా తొలగించింది. గతేడాది కూటమి పాలనలో లబ్ధిపొందిన లబ్ధిదారుల్లోనూ ఈ ఏడాదిలో మరింతగా కోత పెట్టింది.

అన్నదాత సుఖీభవ నిధులు

రైతులు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబు దగాకు అన్నదాత కన్నీరు పెడుతున్నాడు. కాడి కట్టి.. మేడి పట్టిన హలధారి ఉరితాళ్లకు వేలాడుతున్నాడు. అప్పులు చేసి ఆరుగాలం అష్టకష్టాలుపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కక.. అప్పుల ఊబిలో కూరుకుపోయి పాడెక్కుతున్నాడు. అన్నదాత సుఖీభవ పథకంతో ఆదుకుంటానని ఆశలు రేకెత్తించిన చంద్రబాబు సర్కారు అమల్లో కోతలు పెట్టి.. గుండె కోతను మిగిల్చింది. రెండేళ్లకు ముందు వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదేళ్లు ముక్కారు పంటలతో ధాన్యసిరులతో విలసిల్లిన జిల్లాలో ఇప్పుడు అన్నదాతలు కుమిలి కుమిలి దుఃఖిస్తున్నారు. ‘వ్యవసాయం దండగ అని చిన్న చూపు చూసిన సీఎం చంద్రబాబు.. ఇప్పటికీ అదే పంథాను అనుసరిస్తున్నారు. చంద్రబాబు పాలనలో కరువు కాటకాలు, ధరాఘాతాలతో వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిపోయింది. కాడి పట్టిన రైతులు.. చివరకు రాళ్లు, మట్టి మోసే కూలీలుగా మారారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంతి అయ్యాక వ్యవసాయాన్ని పండగ చేశారు. ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో నాలుగు అడుగులు ముందుకేసి అంతకు మించి రైతును ఆర్థిక సంక్షోభం నుంచి రారాజుగా చేశారు.

రెండేళ్ల కూటమి పాలనలో

రూ.274.21 కోట్ల లబ్ధి

అధికారం కోసం అలవికాని హామీలిచ్చి.. దక్కాక వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఈ కోవలోనే అన్నదాతలు ఉన్నారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం కంటే మిన్నగా ఆదుకుంటానని నమ్మించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో అప్పుల ఊబిలోకి నెట్టేశారు. తొలి ఏడాది మంగళం పలికారు. రెండో ఏడాదిలో రెండో ఏడాదిలో 3.19 లక్షల మంది అర్హులు దరఖాస్తులు చేసుకుంటే.. చివరకు 1,95,866 మందికి ఇచ్చి చేతులు దలుపుకున్నారు. దాదాపు 84,134 మంది దరఖాస్తులను అకారణంగా తిరస్కరించారు. ఈకేవైసీ, ఆధార్‌లింక్‌, బ్యాంకు అకౌంట్‌ లింకు కాలేదంటూ తదితర కారణాలు చూపి మరో 14 వేల దరఖాస్తులు వివిధ రకాల కారణాలతో పెండింగ్‌ పెట్టారు. మొత్తంగా రెండేళ్లలో అన్నదాత సుఖీభవగా రూ.274.21 కోట్లు అందించింది. తాజా ఏడాది లబ్ధిదారుల జాబితాను పరిశీలిస్తే.. తొలి విడతలో 1,77,545 మందికి లబ్ధికి అన్నదాత సుఖీభవగా రూ.88.77 కోట్ల సాయం అందించనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కూటమి కూతలు, కోతల ప్రభుత్వంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘సూపర్‌’ దగా

జిల్లాలో అర్హులైన రైతులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అడ్డదిడ్డంగా.. అలవి కాని హామీలిచ్చారు. గతంలో 9 ఏళ్లు, ఆ తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉండీ కూడా ఏ నాడు రైతుల సంక్షేమానికి ఒక్క పథకాన్ని అమలు చేయని చంద్రబాబు సూపర్‌ సిక్స్‌లో భాగంగా పీఎం కిసాన్‌ సాయం కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఏటా ప్రతి రైతుకు రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇస్తామని హామీలిచ్చారు. తొలి ఏడాది ఎగ్గొట్టేశారు. ఆ తర్వాత పీఎం కిసాన్‌తో కలిపి అంటూ నాలిక మడతేసి.. రూ.14 వేలు మూడు విడతల్లో ఇస్తామన్నారు. రెండో ఏడాదిలో పథకాన్ని అమలు చేసినా.. గత ప్రభుత్వంలోని లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టారు. రెండో ఏడాదిలో పథకాన్ని అమలు చేసినా.. వైఎస్సార్‌సీపీ పాలనలో ఉన్న లబ్ధిదారుల్లో 18,801 మందికి కోత పెట్టి 1,95,866 మందికి లబ్ధి చేకూర్చింది. మూడో ఏడాదికి వచ్చేసరికి 1,77,545 మంది ఇవ్వనున్నట్లు లబ్ధిదారుల జాబితాను విడుదల చేసింది. గతేడాది లబ్ధిపొందిన లబ్ధిదారుల్లో 18,321 మంది రైతులను జాబితా నుంచి తొలగించింది. ఇలా ఏటా సుమారు 18 వేల మంది రైతులను ఈ పథకం నుంచి తొలగిస్తూ వస్తోంది. అధికారంలోకి రాక ముందు కౌలు రైతులకు పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పినా.. అమల్లోకి వచ్చే సరికి కౌలు రైతుల ఊసే ఎత్తకుండా.. అర్హులైన లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టింది. అర్హత ఉండీ పథకం వర్తించని లబ్ధిదారులకు నెల రోజులు గడువు ఇస్తున్నామని అర్హతులతో తిరిగి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి తిరిగి సాయం అందిస్తామని నిధుల విడుదల ప్రతిసారి చెబుతోంది. కానీ అర్హత ఉండీ లబ్ధి చేకూరని రైతులకు నేటికీ దిక్కులేదు.

వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం

టీడీపీ పాలనలో అన్నదాత సుఖీభవ

వైఎస్సార్‌సీపీ ఐదేళ్లల్లో రూ.1510.70 కోట్లు

జిల్లాలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2.15 లక్షల మంది రైతులకు ఏటా వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద ఏటా రూ.13,500 అందజేసింది. ఐదేళ్లలో మొత్తంగా రూ.1510.70 కోట్లు అందజేయగా, తొలి రెండేళ్లల్లోనే రూ.601.83 కోట్లు అందజేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆర్బీకేలో రైతుల జాబితాలను నోటీసు బోర్డుల్లో ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికి పారదర్శకతకు పాతరేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement