నిమ్మ ధరలు నేలముఖం | - | Sakshi
Sakshi News home page

నిమ్మ ధరలు నేలముఖం

Jun 20 2026 12:01 PM | Updated on Jun 20 2026 12:01 PM

నానాటికీ పతనమవుతున్న వైనం

దిగులు పడుతున్న రైతులు

చిల్లకూరు: అతి పెద్దదిగా పేరొందిన గూడూరు నిమ్మ మార్కెట్లో ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కొనుగోళ్లు తగ్గిపోతుండటంతో ఇక్కడ ధరలు అమాంతం దిగజారుతున్నాయి. ఫలితంగా రైతులు ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఏ పంటకూ సరైన మద్దతు ధరల్లేపోవడంతో కర్షకులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. వేసవిలో మామిడి, నిమ్మ, చీని ధరలు తగ్గిపోతుండటంతో రైతులకు దిక్కుతోచడంలేదు.

నెల్లోనే పతనం

గూడూరు, పొదలకూరు ప్రాంతాల్లో కాయలు మార్కెట్లకు బాగానే వస్తున్నా, కిలో రూ.25 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. గత సీజన్లో కిలో రూ.150 వరకు.. నెల క్రితం రూ.200 వరకు ఉండింది. అయితే ఒక్క నెల్లోనే రేట్లు అమాంతం పడిపోయాయి. వాస్తవానికి ఇక్కడి కాయలు మంచి రుచిగా ఉంటాయనే ఉద్దేశంతో ఉత్తరాది రాష్ట్రాల్లోని వారు బాగా కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాల్లో నిమ్మ సాగు ఎక్కువ కావడంతో అక్కడ్నుంచి కాయలు ఎగుమతవుతున్నాయి. దీంతో ధరలు అమాంతం తగ్గిపోతున్నాయి. తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, నకిరేకల్లు, రాష్ట్రంలోని ఏలూరు, తెనాలి, కర్ణాటకలోని బిజాపూర్‌, మహారాష్ట్రలోని అకోలా తదితర ప్రాంతాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతవుతుండటంతో ఇక్కడ సమస్య తీవ్రమవుతోంది. పొదలకూరు మార్కెట్‌ నుంచి 20.. గూడూరు నిమ్మ మార్కెట్‌ నుంచి 30 నుంచి 50 లారీల వరకు ఇతర రాష్ట్రాలకు నిత్యం వెళ్లేవి. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితే లేదు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement