విద్యాలయం.. అపవిత్రం | - | Sakshi
Sakshi News home page

విద్యాలయం.. అపవిత్రం

Jun 20 2026 12:01 PM | Updated on Jun 20 2026 12:01 PM

పాఠశాల ఆవరణలో

మందుబాబుల హంగామా

వంటగదిలోనే నివాసం

రాత్రి, పగలు తాగుతూ.

భయాందోళనలో విద్యార్ధులు,

తల్లిదండ్రులు

విడవలూరు: కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. మందుబాబుల ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం పక్కన ఉన్న దళితవాడ ప్రాథమిక పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. మధ్యాహ్న భోజనం వండేందుకు ఏర్పాటు చేసిన గదికి తలుపుల్లేవు. కొందరు స్థానిక యువకులు దీనిని అవకాశంగా తీసుకున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అక్కడ మద్యం తాగుతూ ఖాళీ బాటిళ్లను గదిలో పారేస్తున్నారు. అంతేకాకుండా ఫ్యాన్లు ఏర్పాటు చేసుకుని పాఠశాల విద్యుత్‌ను ఉపయోగిస్తూ అక్కడే నిద్రిస్తున్నారు. బడి వేళల్లోనూ మద్యం మత్తులో పడుకుని ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగుతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా మందుబాబులు వంటగదిని ఆక్రమించడంతో విద్యార్థులకు వంట చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఏజెన్సీ నిర్వాహకురాలు ఇంటి వద్ద భోజనం తయారు చేసి తీసుకువస్తోంది.

భయాందోళనలో తల్లిదండ్రులు

పాఠశాల పరిసరాలు ఇలా మారిపోవడంతో తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఉన్నారు. విద్యాశాఖ అధికారులు, పోలీసులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. వంటగదికి తలుపులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement