జిల్లాలో ఇలా.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఇలా..

Jun 19 2026 1:06 AM | Updated on Jun 19 2026 1:06 AM

రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్‌ విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్ణయాలు విద్యార్థులకు శాపాలుగా పరిణమిస్తున్నాయి. రూ.లక్షల్లో ఫీజులను వసూలు చేస్తూ.. అనుమతుల్లేకుండా హాస్టళ్లను నిర్వహిస్తూ.. వందలాది మంది స్టూడెంట్స్‌ను ఇరుకు గదుల్లో కుక్కుతున్నారు. అరకొర వసతులు, నాసిరకమైన భోజనాన్ని అందిస్తున్నా, తమకేమీ సంబంధంలేదనే రీతిలో ఇంటర్‌ బోర్డు అధికారులతో పాటు ఆయా శాఖల ఆఫీసర్లు తప్పించుకుంటున్నారు. చదువు ఒత్తిడి.. నామమాత్రపు ఫెసిలిటీస్‌.. అధ్వానమైన ఫుడ్‌ను తినలేక సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యమవుతోంది. ఈ విషయమై తల్లిదండ్రులకు తెలియజేసినా, కొద్ది రోజులుంటే సర్దుకుపోతారులేనంటూ లైట్‌ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ఎవరికీ చెప్పుకోలేక స్టూడెంట్స్‌ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఉదంతాలు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయి.

నెల్లూరు (టౌన్‌): ఉజ్వల భవిష్యత్తుకు ఇంటర్‌ విద్య కీలకం కావడంతో దీనిపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. నీట్‌, జేఈఈ మెయిన్స్‌, ఐఐటీ, ఎంసెట్‌ తదితర పేర్లతో కోర్సులను కార్పొరేట్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు ప్రారంభించి అందిన కాడికి దండుకుంటున్నాయి. రెగ్యులర్‌ కంటే హాస్టళ్లలో ఉండి చదువుకుంటే సీటు గ్యారెంటీని తామే ఇస్తామంటూ తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. దీంతో తమ పిల్లలను అక్కడే చేర్పించేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటూ.. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు.

అనుమతి లేకుండానే..

జిల్లాలో 185కుపైగా కార్పొరేట్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 35 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. అదే విధంగా 60కుపైగా కాలేజీలకు అనుబంధంగా హాస్టళ్లున్నాయి. ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య, ఆరెన్నార్‌, ఎస్సార్‌, ఓవెల్‌ తదితర జూనియర్‌ కాలేజీలకు సంబంధించిన బ్రాంచీల పేరుతో వసతిగృహాలను విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. ఏసీ, నాన్‌ ఏసీ, భోజన రకాలను బట్టి ఫీజులను నిర్ణయించారు. ఇలా రూ.1.5 లక్షల నుంచి రూ.రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అయితే వీటిలో దేనికీ అనుమతి లేకపోవడం గమనార్హం. ఇరుకు భవనాలు, చిన్న గదుల్లో నలుగురు లేదా ఆరుగురు విద్యార్థులను కుక్కుతూ ఇబ్బందులు పెడుతున్నారు. వీరి సంఖ్యకు అనుగుణంగా టాయ్‌లెట్లూ ఉండటంలేదు. ఇవి అపరిశుభ్ర వాతావరణంలో దర్శనమిస్తుండటంతో స్టూడెంట్స్‌ వెతలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. సరైన గాలి, వెలుతురు లభించడమూ కరువే. వారు పెట్టే భోజనాన్ని తినే పరిస్థితే లేదని వాపోతున్నారు.

హాస్టళ్లు – 60కుపైగా

వసూలు చేస్తోంది – రూ.1.5 లక్షల నుంచి

రూ.2 లక్షలు (గది, భోజనం బట్టి)

బాధ్యతెవరిదో అంతుచిక్కడంలేదు

ఇంటర్‌ జూనియర్‌ కళాశాలల హాస్టళ్ల అనుమతి, బాధ్యత ఎవరిదనే అంశంపై స్పష్టత లేదు. తమకు సంబంధం లేదని జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారులు చెప్తూ.. సంక్షేమాధికారులను అడగాలని సలహా ఇస్తున్నారు. వారిని సంప్రదిస్తే, ప్రభుత్వ వసతిగృహాల విషయంలోనే తమ ప్రమేయముంటుందని.. ప్రైవేట్‌ హాస్టళ్లలో ఏమీ ఉండదని బదులిస్తున్నారు. ఫలితంగా తమ సమస్యలను ఎవరికి తెలియజేయాలో పాలుపోక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఒకవేళ ఎవరైనా యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే, తల్లిదండ్రులకు ఏదో సాకు చెప్పి విద్యార్థులను ఇక్కడ్నుంచి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఇంటర్‌ జూనియర్‌ కళాశాలల హాస్టళ్ల నిర్వహణపై కలెక్టర్‌ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బందీఖానాలుగా

మారిన వైనం

జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వసతిగృహాలు

దేనికీ పర్మిషన్లు లేవంటున్న

ఇంటర్‌ బోర్డు అధికారులు

చేతులు దులుపుకొంటున్న ఆర్‌ఐఓ, బీసీ వెల్ఫేర్‌ అధికారి

అరకొర వసతులు, నాసిరకమైన ఫుడ్‌తో విద్యార్థులకు తంటాలు

అనుమతులు, పర్యవేక్షణ

బాధ్యతెవరిదో..?

ఒత్తిడి, వసతుల్లేమితో పలువురి బలవన్మరణాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement