అనుమతి ఒకచోట..తవ్వకాలు మరోచోట | - | Sakshi
Sakshi News home page

అనుమతి ఒకచోట..తవ్వకాలు మరోచోట

Jun 18 2026 12:17 AM | Updated on Jun 18 2026 12:17 AM

చిట్టమూరు: తాగు, సాగు నీటి అవసరాలను తీర్చే స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో నది పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆరోపిస్తూ చిట్టమూరు మండలానికి చెందిన పలువురు రైతులు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. వారి ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్‌ నదిలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని తిరుపతి, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు నోటీసులిచ్చింది. అయినా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

ప్రశ్నిస్తే ఎదురు దాడి

స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాలకు ఓ ప్రైవేటు సంస్థకు గనుల శాఖ ద్వారా అనుమతులిచ్చారు. కోట మండలం గూడలి ప్రాంతంలో మాత్రమే తవ్వకాలు చేపట్టాలని అనుమతులున్నప్పటికీ.. సదరు సంస్థ నిబంధనలను పట్టించుకోకుండా ఇతర ప్రాంతాల్లో కూడా తవ్వకాలు చేపడుతోందని ఆరోపణలున్నాయి. దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన వారిపై అడిగేందుకు మీరు ఎవరంటూ ఎదురు దాడికి దిగుతున్నారని రైతులు వాపోతున్నారు.

పరిధి దాటి తవ్వకాలు

కోట మండలం గూడలి ప్రాంతంలో మాత్రమే ఇసుక రీచ్‌కు అనుమతులున్నాయి. అక్కడ నిబంధనలను తుంగలో తొక్కి అనుకున్న దాని కన్నా ఎక్కువగా తవ్వకాలు పూర్తి చేసుకుని.. ఇసుక లేదని నిర్ధారించుకున్న అనంతరం స్వర్ణముఖి నదిలో ఎగువ ప్రాంతంలోని చిట్టమూరు మండలంలో ఉన్న గునపాడు, మెట్టు, గునపాటి పాళెం గ్రామాలకు సమీపంలోని నదీ గర్భంలో లోతుగా తవ్వకాలు చేపడుతున్నారు. పగలు, రాత్రి సమయంలో తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నా కనీసం అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

40 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు

చిట్టమూరు, వాకాడు, కోట మండలాలలోని సుమారు 40 గ్రామాలకు తాగు, సాగునీటి అవసరాలకు స్వర్ణముఖి నది ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరాలుగా ఒక పంట పూర్తిగా పండితే రెండో పంటకు నీరు లేని స్థితి ఏర్పడుతోంది. మూడు మండలాల్లో నది పరీవాహపక ప్రాంతాలతోపాటుగా స్వర్ణముఖి నదిని ఆధారంగా చేసుకుని ఉన్న చెరువుల కింద సుమారుగా 15 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. వేసవి కాలంలో నీరు ప్రవహించకపోతే నదిలోనే బోర్లు వేసుకుని పంటలకు నీరు అందించేవారు. ఇలా రైతులు సుమారు 3 వేలకు పైగా బోర్లు నది పరీవాహక ప్రాంతంలో వేసుకుని సాగు చేస్తున్నారు. అలాగే తాగునీటి పథకాలకు చెందిన బోర్లు కూడా నదిలోనే ఉండటంతో భారీగా ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి కష్టాలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టిప్పర్లు, ట్రాక్టర్లతో తరలింపు

ఉచిత ఇసుక పేరుతో కాంట్రాక్ట్‌ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. పెద్ద యంత్రాలతో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా నాయుడుపేట, గూడూరు ప్రాంతాలకు, టిప్పర్ల ద్వారా చైన్నె, బెంగళూరుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని చెబుతున్నారు.

అయినా ఆగలేదు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనుమతులు పొందిన గూడలి రీచ్‌ పరిధిని దాటి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని చిట్టమూరు మండలంలో ఉన్న గునపాడు, గునపాటిపాళెం, మెట్టు గ్రామాల పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో పరిస్థితులు తీవ్రంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ చైన్నెలోని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. రైతులు సమర్పించిన పత్రాలను పరిశీలించిన ట్రిబ్యునల్‌.. స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాలకు బ్రేక్‌ వేయాలని రెండు జిల్లాల కలెక్టర్లకు సూచించినట్లు రైతులు తెలిపారు. అయినా తవ్వకాలు కొనసాగుతున్నాయని, ఇకనైనా అధికారులు స్పందించి ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేసి రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

ఇష్టారాజ్యంగా స్వర్ణముఖి నది

ఇసుక తరలింపు

గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు బేఖాతరు

భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతుల ఆందోళన

రెండు జిల్లాల కలెక్టర్లు పట్టించుకోవడం లేదని ఆవేదన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement