సేంద్రియ వ్యవసాయంపై మొగ్గు | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ వ్యవసాయంపై మొగ్గు

Jun 15 2026 12:23 AM | Updated on Jun 15 2026 12:23 AM

90 వేల ఎకరాల్లో

ప్రకృతి వ్యవసాయం

మిల్లెట్లు, పప్పుధాన్యాల సాగుపై రైతుల ఆసక్తి

నెల్లూరు(వేదాయపాళెం): కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో విసుగు చెందిన జిల్లా రైతాంగం ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయంవైపు మొగ్గు చూపుతున్నారు. వ్యయభారం, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల లభ్యతలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో జిల్లా రైతాంగం ప్రత్యామ్నాయంగా సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తోంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా తక్కువ పెట్టుబడితో మెరుగైన ఆదాయం సాధించవచ్చనే అవగాహన పెరగడంతో రైతులు ఈ విధానంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా సుమారు 90 వేల ఎకరాల్లో మినుము, పెసర, అలసంద, కొర్రలు, సామలు తదితర పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు తక్కువగా ఉంటాయనే అభిప్రాయం కారణంగా అన్నదాత దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే కాలక్రమంలో వ్యవసాయ వ్యయాలు పెరగడం, మార్కెట్‌లో సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరగడం వంటి కారణాలతో ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మొగ్గు చూపుతున్నారు.

పెరుగుతున్న గిరాకీ

కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహార పదార్థాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఏర్పడింది. రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు వంటి మిల్లెట్‌ ఉత్పత్తులకు వినియోగదారుల ఆదరణ పెరుగుతోంది. సేంద్రియ పద్ధతిలో పండించిన బియ్యం కిలో రూ.125 వరకు విక్రయమవుతుండగా, కొన్ని మిల్లెట్‌ ఉత్పత్తులు కిలో రూ.200 నుంచి రూ.250 వరకు ధర పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్లతోపాటు ప్రతి సోమవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా కూడా ఈ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది.

పెరిగిన సాగు విస్తీర్ణం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ముందు జిల్లాలో కేవలం 10 వేల ఎకరాల్లో మాత్రమే ప్రకృతి వ్యవసాయ సాగు జరిగేది. అయితే కరోనా విపత్తు వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అన్నదాతను సర్కారు అన్నివిధాలా ఆదుకోవడం, డెల్టా రైతులతోపాటు, మెట్ట ప్రాంత రైతులకు సహాయ, సహకారాలు అందించడం, మార్కెట్‌లో లభిస్తున్న ప్రోత్సాహం కారణంగా జిల్లాలో క్రమంగా సేంద్రియ వ్యవసాయ సాగు విస్తీర్ణం 90 వేల ఎకరాలకు చేరుకుంది. దీంతో జిల్లాలో ప్రకృతి వ్యవసాయం క్రమంగా విస్తరిస్తూ రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా మారుతోంది.

అధిక లాభం

రైతులు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకుని పంటలు సాగుచేస్తే అధిక లాభం పొందవచ్చు. ప్రస్తుతం ఆ ఉత్పత్తులకు గిరాకీ ఉంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చిన్నపాటి మెళకువలతో అధిక దిగుబడులు సాధించవచ్చు. అన్నదాతలకు సూచనలిచ్చేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం.

– కన్నయ్య, ప్రకృతి వ్యవసాయం, జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement