ఓటేయలేదని టీడీపీ అక్కసు | - | Sakshi
Sakshi News home page

ఓటేయలేదని టీడీపీ అక్కసు

Apr 20 2026 7:24 AM | Updated on Apr 20 2026 7:24 AM

ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయలేదనే అక్కసుతో ఎన్నో ఏళ్లుగా డీఫారం పట్టాలు పొంది అనుభవిస్తున్న రైతుల పేర్లను ఆన్‌లైన్‌లో తొలగించి ఆ భూమిని తెలుగు తమ్ముళ్లకు కట్టబట్టేందుకు ప్రయత్నం కొనసాగుతోంది. అధికారులు కూడా టీడీపీ నేతల ఆగడాలకు వంత పాడుతూ బాధిత రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ భూమిని నమ్ముకున్న రైతులను ఇబ్బందులు పెడుతున్న ఘటన చేజర్ల మండలం, బిల్లుపాడు గ్రామంలో జరుగుతోంది.

ఆన్‌లైన్‌లో రైతుల పేర్ల తొలగింపు

ఆ భూమిని తమ్ముళ్లకు

కట్టబెట్టేందుకు యత్నం

మంత్రి ఆనం అనుచరుడి నిర్వాకం

చేజర్ల: మండలంలోని బిల్లుపాడు గ్రామంలో సర్వే నంబర్‌ ఒకటిలో 180 ఎకరాల అనాధీన ప్రభుత్వ భూమి ఉంది. 1998 సంవత్సరంలో ప్రభుత్వం 40 మంది నిరుపేద రైతులకు 70 ఎకరాలకు పైగా భూమిని పంచి పట్టాలు అందజేసింది. అప్పటి నుంచి పట్టాలు పొందిన రైతులు ఆ భూములను సాగులోకి తెచ్చుకొని కరెంటు సర్వీసులు, బోర్లు, మోటార్లు ఏర్పాటు చేసుకుని పైర్లు వేసుకుంటున్నారు. తరువాత 2007 ప్రాంతంలో వారికి మాన్యువల్‌గా పట్టాదారు పాస్‌ పుస్తకాలు మంజూరు చేశారు. 2010లో ఆన్‌లైన్‌ చేసే క్రమంలో కొంతమందివి మాత్రమే జరిగింది. చాలామంది రైతులు ఈ భూమి పత్రాలను బ్యాంకులో తనకా కూడా పెట్టి రుణాలు కూడా పొంది ఉన్నారు.

అధికారులతో కుమ్మకై ్క..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు అనుకూలంగా ఓటు వేయలేదనే అక్కసుతో గ్రామానికి చెందిన టీడీపీ నేత, దేవదాయ శాఖ మంత్రి ఆనం అనుచరుడు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తొలుత పట్టాలు లేని భూముల్లో ఆక్రమణలతో పాటు పట్టాలు పొంది సాగులో ఉన్న భూముల్లో ఉన్న నిమ్మ చెట్లను సైతం తొలగించి బోర్డు ఏర్పాటు చేశారు. వెంటనే రీసర్వే ప్రక్రియ గ్రామంలో జరగడంతో సర్వే నంబర్‌ ఒకటికి సంబంధించిన భూముల్లో పట్టాలు పొంది అనుభవంలో ఉన్న రైతుల పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉండగా దీనికి విరుద్ధంగా కూటమి నాయకుల మాటలు విన్న రెవెన్యూ యంత్రాంగం అన్నదాతలకు అన్యాయం చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే ఉన్నవి లేనివి సృష్టించి అక్రమ కేసులు బనాయిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement