● జిల్లాలో 200 మంది వరకు
వ్యాధిగ్రస్తులు
● సరైన చికిత్సతో సాధారణ జీవితం
నెల్లూరు(అర్బన్): హీమోఫీలియా.. ఇది అరుదైన వ్యాధి. అనుకోకుండా శరీరానికి చిన్నగాయమైనా, గీసుకున్నా రక్తం త్వరగా ఆగకపోవడాన్ని ఇలా పిలుస్తారు. రక్తం ఎక్కువగా రావడంతో ప్రాణాంతకమయ్యే అవకాశం ఎక్కువ. రక్తం గడ్డకట్టే ఫ్యాక్టర్లలో లోపం వల్ల ఇది వస్తుంది. ప్రధానంగా ఇది వంశపారంపర్యంగా (జెనెటిక్) వచ్చే వ్యాధి. అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీని ప్రపంచ హీమోఫీలియా డేగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం వివిధ ఆస్పత్రుల్లో అవగాహన కార్యక్రమాలు జరిగాయి.
జిల్లాలో ఇదీ పరిస్థితి
కచ్చితమైన రికార్డులు లేకపోయినప్పటికీ ఐఎంఏ అంచనా ప్రకారం జిల్లాలో 200 మంది రోగులు వరకు ఉన్నట్టు తెలుస్తోంది. చైన్నె, హైదరాబాద్ నగరాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్న వారే ఎక్కువ. అతి చిన్న గాయంతోనే ఎక్కువ సేపు రక్తస్రావం జరగడంతో ఈ జబ్బు వచ్చిన రోగులు జీవితాంతం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఫ్యాక్టర్ రీప్లేస్‌మెంట్ థెరపీ అందుబాటులో ఉంది. అవసరమైనప్పుడు ఉచితంగా మందులు అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి అవగాహన లేకపోవడంతో ఆలస్యంగా ఆస్పత్రికి వస్తున్నారు. ఎక్కువగా పురుషుల్లోనే ఈ జబ్బు వస్తుంది.
లక్షణాలు ఏంటంటే..
చిన్నపాటి గీరుకున్నా రక్తం ఆగకపోవడం, మోకాళ్లు, కండరాల్లో వాపు, నొప్పి, తరచూ ముక్కునుంచి రక్తస్రావం, దంత చికిత్స తర్వాత కూడా రక్తస్రావం ఆగకపోవడం.. ఇలాంటి వారు గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదకరమైన క్రీడలకు దూరంగా ఉండాలి. డాక్టర్ సూచించిన చికిత్సను క్రమంగా తీసుకోవాలి. కుటుంబ సభ్యులు కూడా అవగాహన కలిగి ఉండాలి. ఈ రకమైన కేసులు తక్కువగా ఉన్నా అవగాహన లోపంతో సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ఈ వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని అవసరమైనప్పుడు రోగులకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రక్తస్రావం నియంత్రణలో వైద్యం ముందడుగు వేస్తోంది.


