9 నుంచి పెంచలకోనలో శ్రీవారి వసంతోత్సవాలు
రాపూరు: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహ స్వామికి ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. గురువారం ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, సీతారామయ్యస్వామి మాట్లాడుతూ చైత్ర మాసం వసంత రుతువులో వసంతోత్సవాలు నిర్వహించడం ఆచారమన్నారు. 9న రాత్రి అంకురార్పణ, 10న ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 7 గంటలకు శేషవాహన సేవ, 11న రాత్రి 7 గంటలకు హంస వాహనసేవ, 12న రాత్రి 7 గంటలకు గజ వాహనసేవ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): స్పోర్ట్స్ కోచింగ్‌కు సంబంధించి ఆరువారాల సర్టిఫికెట్ కోర్సులు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఎస్‌డీఓ ఆర్‌కే యతిరాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్) పాటియాలాలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించే సిక్స్ వీక్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్‌లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, క్రికెట్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, జూడో, కబడ్డీ, ఖోఖో, రోల్‌బాల్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, తైక్వాండో, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, యోగా తదితర వాటిల్లో శిక్షణ ఇస్తారన్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 14వ తేదీలోగా https://www.6 wcc.nsni.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గుర్తుతెలియని వాహనం
ఢీకొని వృద్ధురాలి మృతి
నెల్లూరు(క్రైమ్): వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. చైన్నె వైపు వెళ్లే గుర్తుతెలియని వాహనం గుర్తుతెలియని వృద్ధురాలిని ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. మృతురాలి వయసు 60 సంవత్సరాల పైన ఉండొచ్చని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.
కండలేరులో
48.241 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 48.241 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,320, పిన్నేరు కాలువకు 5, లోలెవల్ కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
9 నుంచి పెంచలకోనలో శ్రీవారి వసంతోత్సవాలు


