Political War Between Nellore TDP Senior Leaders - Sakshi
Sakshi News home page

ప్చ్‌.. నెల్లూరు టీడీపీ సీనియర్ల దుస్థితి ఇది

Published Tue, Jul 18 2023 4:04 AM

- - Sakshi

జిల్లాలో నారా లోకేశ్‌ నిర్వహించిన యువగళం పాదయాత్ర టీడీపీలో చిచ్చురేపింది. ఇప్పటికే పార్టీ పరిస్థితి దిగజారుతున్న క్రమంలో పాదయాత్ర జోష్‌ నింపుతుందని ఆశించిన ఆ పార్టీ శ్రేణులకు నిరుత్సాహమే మిగిలింది. పాదయాత్రలో వలస నేతలకు రెడ్‌కార్పెట్‌ వేసిన చినబాబు కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉండి జెండా మోసిన సీనియర్‌ నేతలు అవమానపడేలా చేయడంతో వారు అంటీముట్టనట్లు వ్యవహరించారు. పాదయాత్రకు ప్రజల్లో కూడా సృందన కరువై ఫ్లాప్‌షోగా మారింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నేత నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర గత నెల 13వ తేదీన జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు నెల రోజులకు పైగా చినబాబు పాదయాత్ర చేపట్టారు. నిత్యం పసలేని ఆరోపణలు, తడబడిన ఉచ్ఛారణ వెరసి ప్రజల్లో మరింత చులకన అయ్యాడు. ప్రజల్లో కూడా స్పందన లేకపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో ఫ్లాప్‌షోగా మారింది. ఓ వైపు టీడీపీ నేతలు సభలను విజయవంతం చేసేందుకు జన సమీకరణ కోసం కోట్లాది రూపాయలు వెదజల్లినా ఆశించిన ఫలితాలు కన్పించలేదు.

ఒకే ఫార్ములా..
ఇటీవల కాలంలో టీడీపీ నేతలు నిర్వహించే సభల్లో ఒకే ఫార్ములా పాటిస్తున్నారు. టీడీపీ సభలకు జనస్పందన లేకపోవడంతో జనం ఎక్కువగా కన్పించేందుకు వారు ఇరుకు రోడ్లపై సభలు నిర్వహిస్తున్నారు. సహజంగా సభ జరిగే ప్రాంతం వై జంక్షన్‌లో రెండువైపులా కన్పించేలా వాహనం ఉంచి ప్రసంగాలు చేస్తారు. కానీ టీడీపీ సభలు జరిగే ప్రదేశం జంక్షన్‌ ఉన్న ప్రాంతాన్ని కాదని ఇరుకురోడ్లపై ఏర్పాటు చేస్తున్నారు.

దాదాపు 40 అడుగుల రోడ్డులో రహదారికి ఇరువైపులా పది అడుగులు కుదించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. రెండువైపులా ఇరవై అడుగులు కుదించడంతో ఇరవై అడుగులు మాత్రమే ఉండేలా చేస్తున్నారు. అక్కడ వెయ్యి మంది జనం పోగైతే చాలు వేలాది మంది ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్‌ కెమెరాతో షూట్‌ చేసి వేలాది మంది ఉన్నట్లు భ్రమలు కల్పించే ఫార్ములాను అమలు చేస్తున్నారు. గతంలో కందుకూరులో చంద్రబాబు సభ ఇదే రీతిలో చేపట్టడంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో 10 మందికి పైగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇదే ఫార్ములా యువగళంలో కూడా అమలు చేసి సభలు నిర్వహించారు.

సీనియర్‌ నేతలకు అవమానాలు
లోకేశ్‌ పాదయాత్రలో టీడీపీ సీనియర్‌ నేతలకు ఘోర అవమానాలు ఎదురయ్యాయి. ఆత్మకూరులో నాలుగేళ్లపాటు పార్టీ ఇన్‌చార్జిని కూడా నియమించని దుస్థితి ఉంది. ఈ క్రమంలో ఆత్మకూరుకు వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి(వెంకటగిరి) కోసం పాకులాడాల్సి వచ్చింది. పార్టీ సీనియర్‌ నేతలంతా ఆత్మకూరులో యువగళం వ్యవహారాలు చూడాలని ఆనంను కోరడంతో ఆయన కొన్ని డిమాండ్‌లు విధించారు. పాదయాత్ర జరిగే సమయంలో టీడీపీ సీనియర్‌నేత గూటూరు కన్నబాబు కన్పించకూడదని తెగేసి చెప్పడంతో ఆనం కోసం కన్నబాబును దూరంగా పెట్టాల్సి వచ్చింది.

ఆత్మకూరులో కష్టకాలంలో కూడా పార్టీని నమ్ముకుని వెన్నంటి ఉన్న కన్నబాబును ఆనం మూలాన బలిచేయాల్సి వచ్చింది. పాదయాత్ర జరిగే సమయంలో ఆయన్ను విదేశీ పర్యటన పేరుతో పంపాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు లోకేశ్‌ను కలిసే అవకాశం లేకుండా చేశారు. కాగా నెల్లూరురూరల్‌ నియోజకవర్గంలో అదే సీన్‌ జరిగింది. వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోసం ఆ పార్టీ జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ను పక్కనపెట్టారు. గత నాలుగేళ్లలో టీడీపీ నేతలను ముప్పతిప్పలు పెట్టిన కోటంరెడ్డి కోసం అబ్దుల్‌ అజీజ్‌ను బలి చేశారు. ద్వితీయశ్రేణి నేతలు సైతం కోటంరెడ్డి రాకతో లోలోన కుమిలిపోతున్నారు.

పసలేని ఆరోపణలు
జిల్లాలో లోకేశ్‌ పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై చేసిన పసలేని అడ్డుగోలు ఆరోపణలు ఆయన్ని నవ్వులపాలు చేశాయి. అవినీతి, అక్రమాలకు పాల్పడి వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెండ్‌ అయిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకుని అవినీతి జరిగిందని చెప్పడంపై అందరినీ ఆశ్చర్యపరిచింది. లోకేశ్‌ పసలేని ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సవాల్‌ విసిరినా టీడీపీ నేతలు మారుమాట్లాడక పోవడం గమనార్హం.

ఒక్కొక్కరికీ ఒక్కో చేదు అనుభవం
► నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి నారాయణ కోసం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి ఉద్వాసన పలికారు. గత నాలుగేళ్లుగా టీడీపీ నగర నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న కోటంరెడ్డిని కాదని మాజీ మంత్రికి బాధ్యతలు అప్పగించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా ఈ దఫా నేను ఎమ్మెల్యే అభ్యర్థినని కోటంరెడ్డి బహిరంగంగా ప్రకటించుకోగా ఆ కలను చినబాబు కలగానే మిగిల్చాడు.

► కోవూరు నియోజకవర్గంలో సీనియర్‌ నేతలను సైతం టీడీపీ పెద్దలు కరివేపాకులా వాడుకుంటున్నారు. దశాబ్దాల కాలంగా ఆ పార్టీని నమ్ముకున్న పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి ప్రతి దఫా సీటు ఇస్తామంటూ ఆశపెడుతూ అన్యాయం చేస్తున్నారు. యువగళంలో కూడా పెళ్లకూరుకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన గర్రుగా ఉన్నారు.

► కావలి నియోజకవర్గంలో సీనియర్‌ నేతలకు చుక్కలు చూపించారు. బీద రవిచంద్ర మాలేపాటి సుబ్బానాయుడుని తెరపైకి తెచ్చి చేతిచమురు వదిలింపజేయగా, ప్రస్తుతం దగుమాటి వెంకటకృష్ణారెడ్డిని తెరపైకి తెచ్చారు. అనంతరం అందరికీ మస్కాకొట్టి బీద రవిచంద్ర యువగళంలో తన సతీమణిని రంగంలోకి దింపడంతో టికెట్‌ ఆశించే నేతలకు దిమ్మదిరిగి మైండ్‌బ్లాక్‌ అయిందని అందరూ చర్చించుకున్నారు.

► ఉదయగిరిలో టికెట్‌ నీదేనంటూ పార్టీకి ఫండ్‌ తీసుకుని ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేష్‌ను చినబాబు ఎంకరేజ్‌ చేశారు. దీంతో టికెట్‌ ఆశించిన కాకర్ల సేవా కార్యక్రమాల పేరుతో ఉదయగిరిలో మకాం వేశారు. తీరా యువగళంలో కాకర్లను దూరం పెట్టారు. పాదయాత్రలో ఆయన నీడ కూడా పడకుండా పంపించేశారు. అలాగే పార్టీలో సీనియర్‌నేతగా ఉన్న కంభం విజయరామిరెడ్డికి అవమానం జరిగింది. కొండాపురంలో జరిగిన సభలో కంభంకు మైకు ఇవ్వకుండా దింపేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, దగుమాటి వెంకటకృష్ణారెడ్డిలకు మైకు ఇచ్చి మాట్లాడించిన చినబాబు కంభం విజయరామిరెడ్డికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement