
PC: BCCI
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా మంగళవారం మొదలైంది. గ్రూప్-‘బి’ మ్యాచ్‌లో భాగంగా హాంకాంగ్‌పై అఫ్గనిస్తాన్ 94 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా టాపర్‌గా నిలిచి.. రన్‌రేటు పరంగా (+4.700)నూ పటిష్ట స్థితిలోకి వెళ్లింది.
ఈ క్రమంలో గ్రూప్-‘ఎ’ తొలి మ్యాచ్‌లో భాగంగా టీమిండియా- యూఏఈ (IND vs UAE)తో తలపడనుంది. దుబాయ్‌లో బుధవారం నాటి ఈ మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఎంపిక ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
అభిషేక్, బుమ్రా, సంజూ.. వావ్.. ఎవరిని తప్పిస్తారు?
భారత్ పటిష్ట జట్టుగా పేర్కొన్న అక్తర్.. ఉన్న పదిహేను మంది సూపర్ అని.. వారిలో ఎవరిని పక్కనపెడతారో అర్థం కావడం లేదని పేర్కొన్నాడు. ఓ యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘అచ్చా.. అభిషేక్ వచ్చేశాడు. బుమ్రా (Jasprit Bumrah) ఉన్నాడు. అంతేకాదు సంజూ కూడా ఉన్నాడు. తిలక్ ఉన్నాడు.
హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్ కూడా ఉండనే ఉన్నారు. శుబ్‌మన్ ఉన్నాడు. సూర్య ఉన్నాడు. శివం దూబేతో పాటు మన అక్షర్ పటేల్ కూడా!.. ఇందులో ఎవరిని తప్పించగలరు మిత్రమా!’’ అంటూ షోయబ్ అక్తర్ తనదైన శైలిలో కామెంట్లు చేశాడు.
కత్తిమీద సాములా
ప్రస్తుత పరిస్థితుల్లో భారత తుదిజట్టు కూర్పు మేనేజ్‌మెంట్‌కు కత్తిమీద సాములా మారిందంటూ టీమిండియా అత్యంత పటిష్టంగా ఉందని అక్తర్ చెప్పకనే చెప్పాడు. ఇక తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన విజయం నల్లేరు మీద నడకేనన్న అక్తర్.. యూఏఈ కూడా మంచి జట్టేనని కితాబులు ఇచ్చాడు.
ఓటమి ఖాయమే.. కానీ కనీసం
‘‘టీమిండియా చేతిలో యూఏఈ ఓడిపోతుందని తెలుసు. అయితే, తక్కువ తేడాతో ఓడిపోవాలని ఆకాంక్షిస్తున్నా. తొలి మ్యాచ్లో అఫ్గనిస్తాన్ చేతిలో హాంకాంగ్ చిత్తుగా ఓడింది. కనీసం మీరైనా అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. కాస్తైనా పోరాట పటిమ కనబరచండి. విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయినా పర్లేదు. అది కూడా గొప్ప అచీవ్‌మెంట్ లాంటిదే’’ అని అక్తర్ యూఏఈ జట్టుకు సూచించాడు.
దాయాదితో ఆరోజే పోరు
ఇదిలా ఉంటే.. రెండో మ్యాచ్‌లో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొడుతుంది. సెప్టెంబరు 14న ఈ హై వోల్టేజీ మ్యాచ్‌కు షెడ్యూల్ ఖరారైంది. ఇక లీగ్ దశలో ఆఖరిగా భారత జట్టు.. సెప్టెంబరు 19న ఒమన్‌తో తలపడుతుంది. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.
గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ రేసులో నిలిచాయి. ఇక ఈ ఖండాంతర టోర్నీలో టీమిండియా అత్యధికంగా ఎనిమిదిసార్లు గెలవగా.. శ్రీలంక ఆరు, పాకిస్తాన్ రెండుసార్లు గెలిచాయి. మిగతా జట్లలో బంగ్లాదేశ్ రెండుసార్లు ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఆసియా కప్-2025కి టీమిండియా
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.
చదవండి: పక్షవాతం.. నొప్పి భరించలేకపోయా: టీమిండియా స్టార్ క్రికెటర్
ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు