కైనన్, రాజేశ్వరి జోడీగా... | World Cup Shooting Shotgun Tournament from today | Sakshi
Sakshi News home page

కైనన్, రాజేశ్వరి జోడీగా...

Mar 26 2026 2:02 AM | Updated on Mar 26 2026 2:02 AM

World Cup Shooting Shotgun Tournament from today

నేటి నుంచి ప్రపంచకప్‌ షూటింగ్‌ షాట్‌గన్‌ టోర్నీ

టాంజియర్‌ (మొరాకో): అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) కొత్త సీజన్‌కు నేటి నుంచి తెర లేవనుంది. నాలుగు షాట్‌గన్‌ ప్రపంచకప్‌లలో భాగంగా తొలి టోర్నీ నేడు మొదలుకానుంది. తొలి రోజు ప్రారంభోత్సవం జరుగుతుంది. శుక్రవారం స్కీట్‌ ఈవెంట్‌లో పోటీలు ఆరంభమవుతాయి. భారత్‌ నుంచి 12 మంది షూటర్లు పతకాల వేటకు సిద్ధమయ్యారు. 

హైదరాబాద్‌ షూటర్, రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కైనన్‌ చెనాయ్, అతని భార్య రాజేశ్వరి కుమారి వ్యక్తిగత విభాగంతోపాటు మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కలిసి ఆడనున్నారు. ఇటీవల కైనన్, రాజేశ్వరి వివాహం జరిగింది. 35 ఏళ్ల కైనన్‌ 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో టీమ్‌ ట్రాప్‌ ఈవెంట్‌లో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచాడు. 34 ఏళ్ల రాజేశ్వరి 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో టీమ్‌ ట్రాప్‌ ఈవెంట్‌లో రజత పతకం సాధించింది.  

మరోవైపు ట్రాప్‌ ఈవెంట్‌లో వెటరన్‌ షూటర్‌ జొరావర్‌ సింగ్‌ సంధూ ‘వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌’లో భాగంగా ఈ టోర్నీ నుంచి చివరి నిమిషంలో వైదొలిగాడు. 48 ఏళ్ల జొరావర్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జొరావర్‌ ట్రాప్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించాడు. తద్వారా కర్ణీ సింగ్‌ (1962లో), మానవ్‌జీత్‌ సింగ్‌ సంధూ (2006లో) తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన మూడో భారతీయ ట్రాప్‌ షూటర్‌గా జొరావర్‌ గుర్తింపు పొందాడు.  

భారత షూటింగ్‌ జట్టు: పృథ్వీరాజ్‌ తొండైమన్, కైనన్‌ చెనాయ్, భౌనీశ్‌ మెందిరత్తా, కీర్తి గుప్తా, రాజేశ్వరి కుమారి, ఆషిమా అహ్లావత్‌ (ట్రాప్‌). మాన్‌ సింగ్, జ్యోతిరాదిత్య సింగ్‌ సిసోడియా, పరంపాల్‌ సింగ్, యశస్వి రాథోడ్, దర్శన రాథోడ్, మహేశ్వరి చౌహాన్‌ (స్కీట్‌). కైనన్‌ చెనాయ్‌–రాజేశ్వరి కుమారి, పృథ్వీరాజ్‌ తొండైమన్‌–కీర్తి గుప్తా (మిక్స్‌డ్‌ టీమ్‌).  

Advertisement
 
Advertisement
Advertisement