టీమిండియాకు బిగ్‌ షాక్‌ | Team India Faces Setback As Pratika Rawal Injured Ahead Of Women's CWC 2025 Semi-Final vs Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్‌ షాక్‌

Oct 27 2025 7:55 AM | Updated on Oct 27 2025 10:37 AM

Women's CWC 2025: Pratika Rawal limps off the field during Bangladesh match with injury

మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా అక్టోబర్‌ 30న ఆస్ట్రేలియాతో జరుగబోయే సెమీఫైనల్‌ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. నిన్న (అక్టోబర్‌ 26) బంగ్లాదేశ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌ సందర్భంగా ఇన్‌ ఫామ్‌ ఓపెనర్‌ ప్రతిక రావల్‌ (Pratika Rawal) తీవ్రంగా గాయపడింది. దీంతో సెమీస్‌ మ్యాచ్‌కు ఆమె అందుబాటులో ఉంటుందా లేదా అన్నది అనుమానంగా మారింది.

ప్రస్తుతానికి ప్రతిక గాయంపై ఎలాంటి అప్‌డేట్‌ లేనప్పటికీ.. అభిమానుల్లో మాత్రం ఆందోళన నెలకొలింది. ప్రతిక న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో స్మృతి మంధనతో సహా విధ్వంసకర శతకం బాదిన విషయం తెలిసిందే. ప్రస్తుత ‍ప్రపంచకప్‌లో ప్రతిక మంధనతో కలిసి భారత్‌కు శుభారంభాలు అందిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.

అలాంటి ప్రతిక ఆసీస్‌తో జరుగబోయే డూ ఆర్‌ డై సెమీఫైనల్‌ మ్యాచ్‌కు దూరమైతే, టీమిండియా విజయావకాశాలు తప్పక ప్రభావితమవుతాయి.

మ్యాచ్‌ రద్దు
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నిన్న జరిగిన భారత్‌-బంగ్లాదేశ్ మ్యాచ్‌ వర్షం​ కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 9 వికెట్ల నష్టానికి 119 పరుగుల స్వల్ప స్కోర్‌కు పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్‌ 21వ ఓవర్ రెండో బంతికి మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్రతిక తీవ్రంగా గాయపడింది.

విలవిలాడిపోయిన ప్రతిక
మైదానం​ చిత్తడిగా ఉండటంతో రన్నింగ్‌ చేసే​ సమయంలో ప్రతిక కుడి కాలి మడమ మడతపడింది. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆమెను సిబ్బంది డ్రెస్సింగ్‌ రూమ్‌కు తీసుకెళ్లారు. ఆతర్వాత ఆమె తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. ఆమె స్థానంలో అమన్‌జోత్ కౌర్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.

ఛేదనలో అమన్‌జోత్‌, మంధన 8.4 ఓవర్లలో 57 పరుగులు జోడించాక వర్షం​ మళ్లీ మొదలుకావడంతో మ్యాచ​్‌ను రద్దు చేశారు.

రికార్డుల ప్రతిక
ప్రతిక న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో పలు రికార్డులు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో చేసిన సెంచరీ ఆమెకు ప్రపంచకప్‌ టోర్నీలో మొదటిది. ఈ మ్యాచ్‌లో ఆమె మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్లలో  ఒకరిగా నిలిచింది. అలాగే మంధన తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది.

ప్రతిక దూరమైతే..?
ప్రతిక ఆస్ట్రేలియాతో జరుగబోయే సెమీఫైనల్‌ మ్యాచ్‌కు దూరమైతే టీమిండియా తీవ్రమైన కష్టాలు ఎదుర్కోనుంది.  ప్రతిక స్థానాన్ని భర్తీ చేసే ఓపెనర్ ఎవరూ జట్టులో లేరు. ఐసీసీ అంగీకారంతో రిజర్వ్‌లలో లేని ప్లేయర్‌ను పిలిపించుకోవాల్సి వస్తుంది. ప్రతిక పూర్తిగా టోర్నీ నుంచి తప్పుకుంటేనే ఇది సాధ్యపడుతుంది.

టీమిండియాకు మరో సమస్య
ప్రతిక గాయానికి ముందే టీమిండియా మరో సమస్య ఉండింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రిచా ఘోష్ గాయపడింది. దీంతో బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు ఆమెకు విశ్రాంతినిచ్చారు. సెమీస్‌ మ్యాచ్‌కు రిచా అందుబాటులో ఉంటుందా లేదా అన్నదానిపై కూడా ప్రస్తుతానికి సమాచారం లేదు. గాయాల నేపథ్యంలో టీమిండియా సెమీస్‌లో పటిష్టమైన ఆసీస్‌ను ఏమేరకు నిలువరించగలదో చూడాలి.

కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ సెమీస్‌కు అర్హత సాధించాయి. అక్టోబర్‌ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్‌, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఫైనల్‌ మ్యాచ్‌ (నవీ ముంబై) నవంబర్‌ 2న జరుగుతుంది. 

చదవండి: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement