ఊహించిన విధంగానే జరిగింది. యాషెస్ సిరీస్ (Ashes Series 2025-26) తొలి టెస్ట్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) దూరమయ్యాడు. వెన్నెముకలో స్ట్రెస్ ఇంజ్యూరీ కారణంగా కమిన్స్ జూలై నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. కమిన్స్ గైర్హాజరీలో తొలి టెస్ట్‌కు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ (Steve Smith) ఎంపికయ్యాడు.
ఈ విషయాలను క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 21న పెర్త్‌లో తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. కమిన్స్ స్థానాన్ని స్కాట్ బోలాండ్ భర్తీ చేసే అవకాశం ఉంది. బోలాండ్.. జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌తో కలిసి తొలి టెస్ట్‌లో బౌలింగ్ బాధ్యతలు చేపట్టవచ్చు.
ప్రస్తుతం కమిన్స్ రన్నింగ్ చేయగలుగుతున్నా, బౌలింగ్ చేయడం లేదు. పూర్తి రికవరీకి కనీసం నాలుగు వారాల సమయపడుతుందని అతనే స్వయంగా చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే డిసెంబర్ 4న బ్రిస్బేన్‌లో ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌కు కమిన్స్ అందుబాటులోకి రావొచ్చని తెలుస్తుంది.
స్టీవ్ స్మిత్ విషయానికొస్తే.. 2018లో సాండ్‌పేపర్ వివాదం తర్వాత కెప్టెన్సీ కోల్పోయిన స్మిత్, కమిన్స్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతూ ఇప్పటివరకు ఆరు టెస్టుల్లో తాత్కాలిక నాయకత్వం వహించాడు. ఆసక్తికరంగా, కెప్టెన్‌గా ఉన్నప్పుడు స్మిత్ బ్యాటింగ్ యావరేజ్ 68.98గా ఉండగా, సాధారణంగా అది 49.9 మాత్రమే.
కాగా, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల యాషెస్ 2025-26 సిరీస్ నవంబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్ నవంబర్ 21న పెర్త్‌లో, రెండో టెస్ట్ డిసెంబర్ 4న బ్రిస్బేన్‌లో, మూడో టెస్ట్ డిసెంబర్ 17న అడిలైడ్‌లో, నాలుగో టెస్ట్ డిసెంబర్ 26న మెల్‌బోర్న్‌లో, ఐదో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 4న సిడ్నీలో ప్రారంభం కానున్నాయి.
స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్‌కు కమిన్స్ దూరం కావడం వారికి ఎదురుదెబ్బే. మరోవైపు ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ కూడా గట్టిగానే కసరత్తు చేస్తుంది. నెల ముందుగానే జట్టును ప్రకటించి సన్నద్దతను వ్యక్తం చేసింది.
యాషెస్ సిరీస్ 2025-26కి ఇంగ్లండ్ జట్టు..
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేకబ్ బేతెల్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జో రూట్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జేమీ స్మిత్, ఓలీ పోప్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, మాథ్యూ పాట్స్
చదవండి: అదరగొట్టిన తెలుగు టైటాన్స్


