మినీ క్వాలిఫయర్‌లో బెంగళూరు బుల్స్‌పై గెలిచి ఎలిమినేటర్–3కు అర్హత
న్యూఢిల్లీ: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటుతున్న తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో ట్రోఫీ చేజిక్కించుకునే దిశగా మరో అడుగు వేసింది. ఈ సీజన్ ఆసాంతం నిలకడగా రాణిస్తున్న టైటాన్స్... ఆదివారం జరిగిన మినీ క్వాలిఫయర్‌లో 37–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. దీంతో తెలుగు టైటాన్స్ ఎలిమినేటర్–3కి చేరింది. మంగళవారం జరగనున్న ఆ మ్యాచ్‌లో ఎలిమినేటర్–2 విజేతతో టైటాన్స్ తలపడుతుంది. కీలక పోరులో కెప్టెన్ విజయ్ మలిక్ 10 పాయింట్లతో, భరత్ 12 పాయింట్లతో మెరిశారు.
బెంగళూరు బుల్స్ తరఫున అలీ రెజా 11 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఆదివారమే జరిగిన ఎలిమినేటర్–1 లో పట్నా పైరేట్స్ 48–32తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. పట్నా రైడర్ అయాన్ 20 పాయింట్లతో విజృంభించాడు. అయాన్‌కు ఇది ఐదో సూపర్–20 స్కోరు కావడం విశేషం.
పీకేఎల్ చరిత్రలో ప్రదీప్ నర్వాల్, దేవాంక్ దలాల్ మాత్రమే ఐదు కంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో 20 పాయింట్ల చొప్పున సాధించారు. ఈ విజయంతో పట్నా ఎలిమినేటర్–2కు అర్హత సాధించింది. నేడు లీగ్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ క్వాలిఫయర్–1లో తలపడనున్నాయి. పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ జట్లు ఎలిమినేటర్–2లో ఆడతాయి.


