
ఇంగ్లండ్, వెస్టిండీస్‌ల మధ్య శనివారం నాలుగో టి20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 34 పరుగులుతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఇరు జట్లు రెండు విజయాలతో సమానంగా ఉన్నాయి. టోర్నీ విజేత ఎవరో తేలాలంటే ఆఖరి మ్యాచ్ కీలకం కానుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. కెప్టెన్ మొయిన్ అలీ 63, జేసన్ రాయ్ 52 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి 34 పరుగులతో ఓటమి పాలైంది.
చదవండి: కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు.. చేదు అనుభవమే మిగిల్చింది
మ్యాచ్ ఓటమి అనంతరం విండీస్ కెప్టెన్ పొలార్డ్ తన సొంతజట్టుపై అసహనం వ్యక్తం చేశాడు.'' ఇంగ్లండ్ వికెట్లు తీయడంలో మా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. . ఇంగ్లండ్‌ను 160, 170లోపే కట్టడి చేయాలని భావించాం. చివరి ఓవర్లలో అనవసరంగా 20 పరుగులు ఇచ్చుకున్నాం. ఇంగ్లండ్ చివర్లో బాగా ఆడి తమ స్కోరును 190 దాటించింది. అదే మా కొంప ముంచింది. ఇక సిరీస్ గెలవాలంటే ఆఖరి మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. మా శక్తి మేరకు ప్రయత్నిస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు.