ఓటమి తీవ్రంగా బాధించింది: కోహ్లి

Virat Kohli On Pink Ball Test Hard To Put Feelings In Words - Sakshi

అడిలైడ్‌: పింక్‌ బాల్‌ టెస్టులో ఓటమి తనను తీవ్రంగా కలచివేసిందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ఆ బాధను మాటల్లో చెప్పడం చాలా కష్టమని, ఈ పరాజయం నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లి సేన 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగుల స్కోరుకే పరిమితమై ఘోర ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఆసీస్‌ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఒక్కరు కూడా సింగిల్‌ దాటలేక చేతులెత్తేయడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(చదవండి: టీమిండియా మా రికార్డును బ్రేక్‌ చేసింది: అక్తర్‌)

ఇక మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ కోహ్లి మాట్లాడుతూ.. ‘‘ ప్రస్తుతం నా మదిలో మెదులుతున్న భావాలను వర్ణించడానికి మాటలు రావడం లేదు. మైదానంలో అడుగుపెట్టేసరికి 60 పరుగుల ఆధిక్యంలో ఉన్నాం. కానీ వెనువెంటనే అంతా ముగిసిపోయింది. రెండు రోజుల పాటు బాగానే ఆడాం. కానీ చివరి సమయంలో ఏం చేయలేకపోయాం. ఇది నిజంగా నన్ను బాధించింది. పూర్తిస్థాయిలో బ్యాటింగ్‌ చేయలేకపోయాం. తొలి ఇన్నింగ్స్‌ మాదిరిగానే బౌలర్లు అదే ఏరియాలో బంతులు వేశారు. మేం కూడా వీలైనంత ఎక్కువ స్కోరు చేయాలనే భావించాం. కానీ అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. నిర్లక్ష్య ఆటతీరు, ప్రత్యర్థి జట్టు బౌలర్లు బంతులు సంధించిన విధానం రెండూ కూడా ఓటమికి కారణమయ్యాయి’’ అని పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top