యాషెస్ సిరీస్ 2025-26ను ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఆసీస్ చిత్తు చేసింది. 205 పరుగుల లక్ష్యాన్ని కంగారులు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించారు. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
లక్ష్య చేధనలో ఇంగ్లీష్ జట్టు బౌలర్లను హెడ్ ఉతికారేశాడు. టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన హెడ్.. కేవలం 69 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 83 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 123 పరుగులు చేశాడు.

అతడితో పాటు మార్నస్ లబుషేన్(51) అజేయ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన జోఫ్రా అర్చర్, బెన్ స్టోక్ట్స్ రెండో ఇన్నింగ్స్‌లో తేలిపోయారు.
ఇంగ్లండ్ అట్టర్ ప్లాప్..
కాగా రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఇంగ్లండ్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్(7 వికెట్లు) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే కుప్పకూలిన స్టోక్స్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే తీరును కనబరిచింది. బోలాండ్, స్టార్క్, డాగెట్‌లు నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ 164 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఆసీస్ ముందు 205 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఉంచింది.
అయితే తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లో విఫలమైన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి ఘన విజయాన్ని అందుకుంది. ఫలితంగా మొదటి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కేవలం 132 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 10 వికెట్లు పడగొట్టిన స్టార్క్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండో టెస్టు డిసెంబర్ 4 నుంచి గబ్బా వేదికగా ప్రారంభం కానుంది.
పెర్త్ టెస్టు సంక్షిప్త సమాచారం
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 172/10
టాప్ స్కోరర్ హ్యారీ బ్రూక్ (52)
టాప్ బౌలర్ మిచెల్ స్టార్క్ (7/58)
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 132/10
టాప్ స్కోరర్ క్యారీ(26)
టాప్ బౌలర్ బెన్ స్టోక్స్ (5/23)
ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్: 164/10
టాప్ స్కోరర్: గస్ అట్కిన్సన్ (37)
బెస్ట్ బౌలింగ్: స్కాట్ బోలాండ్ (4 వికెట్లు)
ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్: 205/2
టాప్ స్కోరర్: ట్రావిస్ హెడ్(123)
చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్.. అర్జున్ స్ధానంలో?


